పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల వెంకన్న అధిక ఆశ్వయుజ మాస తిరు కల్యాణ మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఎనిమిది రోజుల పాటు ఈ కల్యాణోత్సవాలను ఏకాంతంగా జరిపించారు. అధిక ఆశ్వయుజ మాస తిరుకళ్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం రాత్రి స్వామి వారికి పుష్పయాగ మహోత్సవం నిర్వహించారు. ముందుగా వేదపండితులు, అర్చకులు స్వామి, అమ్మ వార్ల ఉత్సవమూర్తులను ఆలయంలో అలంకరించారు. 12 రకాల వాయిద్యాలతో 12 రకాల గీతాలు ఆలపించి స్వామివారికి పవళింపు సేవ నిర్వహించారు. అనంతరం పన్నెండు రకాల పిండి వంటలు స్వామివారికి నివేదన చేశారు.
ముగిసిన ద్వారకా తిరుమల స్వామి వారి బ్రహ్మోత్సవాలు
పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయంలో అధిక అశ్వయుజ మాస తిరు కల్యాణ మహోత్సవాలు ముగిశాయి. చివరి రోజైన శనివారం వేంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగం కనుల పండువగా నిర్వహించారు.
ఉదయం ఆలయ పండితులు అర్చకులు యాగశాలలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాల నడుమ మంగళ స్నానాలు చేయించారు. ఆ తర్వాత బుట్టలో ధాన్యం, పసుపుకొమ్ములు వేసి రోకళ్లతో దంచగా వచ్చిన చూర్ణంతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. చూర్ణోత్సవం జరుపుకున్న స్వామి, అమ్మ వార్లకు పండితులు చక్రస్నానం చేయించారు. ఈ కళ్యాణ మూర్తులు స్నానం చేసిన పవిత్ర జలాన్ని వసంతాలుగా పండితులు భక్తులపై చల్లారు. మేళతాళాలు, సన్నాయి వాయిద్యాల నడుమ ఈ వేడుకను శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ఈవో డి. భ్రమరాంబ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.