సంఘసంస్కర్త, అధ్యాత్మికవేత్త, కవి... డాక్టర్. ఉమర్ ఆలీషా 75వ వర్ధంతిని... పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించారు. విశ్వవిజ్ఞాన విద్యా అధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి... సాహితీవేత్తలు, కవులు, అధ్యాత్మికవేత్తలు హాజరయ్యారు. ఉమర్ ఆలీషా వర్ధంతిని పురస్కరించుకుని... సాహితీవేత్తలకు పురస్కారాలు అందజేశారు. 2001 నుంచి నిర్వహిస్తున్న సాహితీసభల్లో... 'హుస్సేన్ షా' కవి పేరు మీద 19 మందిని పురస్కారంతో సత్కరించారు. ఈ ఏడాది నుంచి... ఉమర్ ఆలీషా పేరుతోనూ సాహితీవేత్తలను సత్కరిస్తున్నారు. మొదటి పురస్కారం అధ్యాత్మిక వక్త, సహస్రావధాని గరికపాటి నరసింహారావును వరించింది. హుస్సేన్‌షా కవి పురస్కారాన్ని... కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత... రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డికి అందించారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఏళ్ల కిందట ఏర్పడిన విశ్వవిద్య విజ్ఞాన అధ్యాత్మిక పీఠం... సామాజిక సేవా కార్యక్రమాలకు అంకితమైందని వక్తలు కొనియాడారు. డాక్టర్ ఉమర్ ఆలీషా... ప్రజాప్రతినిధిగానూ సేవలందించారని అన్నారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో అనేక రచనలు చేసిన ఉమర్ ఆలీషా... ప్రజలను ఉద్యమం వైపు నడిపించారని.... సాహితీవేత్తలు, రచయితలు చెప్పారు. అప్పట్లో మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు, అంటరానితనం, మహిళా విద్య వంటి సామాజిక రుగ్మతలపై పోరాడారని గుర్తు చేసుకున్నారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విశ్వ విద్య విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం... సాహితీ కార్యక్రమాలనూ విస్తృతంగా నిర్వహిస్తోంది. సమాజాన్ని సన్మార్గం వైపు నడిపించే... అధ్యాత్మిక పీఠంగా వెలుగొందుతోంది.