పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం భువనపల్లికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన బాధితుడు కొన్ని రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతూ... స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు వద్ద చికిత్స తీసుకున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగవకపోవటంతో ఈ నెల 4న పెదనిండ్రకొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుభాకర్ వైద్య పరీక్షలు చేశారు. చికిత్స నిమిత్తం ఏలూరు తరలించారు. అక్కడ కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ రెండు నమూనాల ఫలితాలు రాకుండానే అతను ఈ నెల 5న మరణించాడు.
తర్వాత వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. బాధితుడు గణపవరంలోని ఐరన్ షాప్లో పని చేసేవాడు. దీంతో రెండు గ్రామాలలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత నెల 28న ఆదివారం ప్రార్ధన నిమిత్తం చర్చికి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.