పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి, కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలాలు కూరగాయల సాగుకు పెట్టింది పేరు. లాక్‌డౌన్ నేపథ్యంలో తోటల నుంచి సరకు బయటకు వచ్చే మార్గాలు మూసుకుపోయాయి. ఇదే అదునుగా వ్యాపారులు రైతుల వద్దకే వెళ్లి తక్కువ ధరకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
తోటలోనే వదిలేసిన టమాటాలు
పది కిలోల వంకాయలు గతంలో రైతుల వద్ద రూ.300 నుంచి రూ.350 వరకు కొనుగోలు చేయగా.. ప్రస్తుతం రూ.100 నుంచి రూ.150 మధ్య కూడా అడగడం లేదు. మొన్నటి వరకు టమాటా ధర పది కిలోలు రూ. 300 ఉంటే ప్రస్తుతం రూ. 150కి చేరింది. కోత కూలీ కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో కాయలను చెట్లకే వదిలేస్తున్నారు.
నిడదవోలు మండలం గోపవరంలో టమాటా తోటలు చాలా వరకు ఎండిపోయాయి. ఇటీవల వరకు బెండ పది కిలోలు రూ. 300 ఉంటే తాజాగా రూ.150 నుంచి రూ.200కు కూడా కొనడం లేదు. ఒక కూలీ నిత్యం పచ్చిమిర్చి 50 కిలోల వరకు కోస్తారు. కూలి రూ. 150 చెల్లించాలి. మార్కెట్‌కు తీసుకెళితే పది కిలోలకు రూ.100 ఇస్తున్నారు. దొండ, బెండ వంటివి సకాలంలో కోయకుంటే ముదిరిపోతాయి. దీంతో గిట్టుబాటు ధర దక్కినా దక్కక పోయినా కోయిస్తున్నారు. జిల్లాలో సుమారు 40 లక్షల మంది వరకు జనాభా ఉన్నారు. వీరందరికి జిల్లాలో పండించే కూరగాయలు చాలా వరకు సరిపోతాయి. ప్రస్తుతం తోటల నుంచి మార్కెట్‌లకు సరకు విరివిగా రాక వినియోగదారులను వ్యాపారులు అందినకాడికి దండుకుంటున్నారు. రైతు బజార్లు ఉన్న ప్రాంతాల్లో కొంతవరకు ప్రజలకు, ఇటు రైతులకు ఉపశమనం కలుగుతోంది.