ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి మూలాలపై నేడు స్పష్టత

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి మూలాలపై నేడు స్పష్టత వచ్చే అవకాశముంది. నీటి కాలుష్యమే ముఖ్య కారణమని వైద్య వర్గాలు భావిస్తున్నా....జాతీయ సంస్థల నివేదికలు వచ్చాకే పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. మరోవైపు మూర్ఛ వ్యాధితో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య భారీగా తగ్గిందని వెల్లడించారు.

eluru strange disease
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి మూలాలపై నేడు స్పష్టత

By

Published : Dec 11, 2020, 5:31 AM IST

ఏలూరులో వింత వ్యాధి బాధితులు తగ్గినా.. వ్యాధి కారణాలు మాత్రం ఇంకా నిర్ధరణ కాలేదు. గత 5 రోజులతో పోల్చితే ..ఆరో రోజు బాధితుల సంఖ్య బాగా తగ్గింది. వందల్లో నమోదైన కేసులు.. ప్రస్తుతం పదుల సంఖ్యకు చేరాయి. విద్యానగర్‌, శాంతినగర్‌, పెన్షన్‌ కాలనీ, ఆర్‌ఆర్‌పేట, పవర్‌పేట, అశోక్‌నగర్‌, కొత్తపేట, తూర్పువీధి, పడమర వీధి, తంగెళ్లమూడి, చోడిదిబ్బ ప్రాంతాల్లో కొత్త కేసులు వచ్చాయని వైద్యులు తెలిపారు.

సీఎస్ పరామర్శ

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో బాధితులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఏ నీళ్లు తాగుతున్నారని వ్యాధి గ్రస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె నగరంలో పారిశుద్ధ్య పరిస్థితిపై ఆరా తీశారు. మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లి..అధికారులతో మాట్లాడారు. పలు సూచనలు చేశారు..

వింత వ్యాధి కారణాలు నిగ్గు తేల్చేందుకు పలు జాతీయ సంస్థలు నగరంలో పరిశోధనలు సాగిస్తున్నాయి. బాధితుల రక్తనమానాలు, తాగునీరు, పాలు, కూరగాయాల నమూనాలు సేకరించి పరీక్షించారు. ఇందులో భార లోహలైన సీసం, నికెల్ ఉన్నట్లు ...దిల్లీ ఎయిమ్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థల నివేదికలో తేలింది. శరీరంలో ఉన్న సీసం, నికెల్‌కు ఆర్గానో క్లోరిన్ కలిసినప్పుడు మూర్ఛ వస్తోందని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నగరానికి తాగు నీటిని అందించే పంపుల చెరువు సమీపంలో అధిక వింత వ్యాధి బాధిత కేసులు నమోదైనట్లు వైద్య వర్గాల పరిశీలనలో వెల్లడైంది. ఈ నీరు ముందుగా వెళ్లే …పత్తేబాద, అశోక్ నగర్, ఒకటో పట్టణం ప్రాంతాల్లో అధిక కేసులు వచ్చినట్లు అధికారులు కనుగొన్నారు.

కారణాల అన్వేషణకు కృషి

దిల్లీ ఎయిమ్స్, ఎన్​ఐఎన్​, ఎన్ సీడీసీ, ఎన్ఐవీ నాలుగు జాతీయ సంస్థలను కమిటీగా ఏర్పడి వింతవ్యాధి కారణాలను శోధిస్తున్నారు. వట్లూరు పారిశ్రామికవాడలో పలు పరిశ్రమలను సందర్శించారు. నగరంలో బాధితులు అధికంగా ఉండే ప్రాంతాల్లో తాగునీటి నమూనాలు సేకరించి.. పరీక్షకు పంపారు. కొత్తగా చేరుతున్న బాధితుల రక్త నమూనాలు సేకరించారు. ఈ కమిటీతో పాటు.. హైదరాబాద్ కు చెందిన సీసీఎంబీ సంస్థ ఈ పరిశోధనలో పాల్గొంటోంది. ఈ సాయంత్రానికి నివేదికలు రానున్నట్లు అధికారులు తెలిపారు.

పూర్తిస్థాయిలో వ్యాధి నిర్ధరణ చేసేందుకు 20 మందితో సీఎస్‌ అధ్యతన ఉన్నతస్థాయి కమిటీని సర్కారు నియమించింది. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు,పలు జాతీయ పరిశోథనా సంస్థల డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఇందులో సభ్యులుగా చేర్చింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వింత వ్యాధిపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాల్సిందిగా కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ సంస్థలు అందించిన నివేదికలనూ ఈ నిపుణుల కమిటీ విశ్లేషించనుంది..

ఇదీ చదవండి:
ఏలూరు వింత వ్యాధి: ఆసుపత్రికి మరో 13 మంది బాధితులు

ABOUT THE AUTHOR

...view details