Tanuku District Central Hospital : కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా సేవలందిస్తూ రాష్ట్రంలోనే అగ్రగామి ఆసుపత్రిగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని జిల్లా కేంద్ర ఆసుపత్రి నిలిచింది. రాష్ట్రంలో ఎన్నో అత్యుత్తమ సదుపాయాలు కలిగిన ఆసుపత్రులను సైతం వెనక్కి నెట్టి కేంద్ర ప్రభుత్వ అవార్డులను సొంతం చేసుకుంది. 150 పడకలు గలిగిన ఈ ఆసుపత్రికి ఏటా 15 లక్షల రూపాయల చొప్పున మూడు సంవత్సరాల పాటు 45 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
రోజూ 300మందికి పైగా ఓపీ.. రాష్ట్రంలోనే అత్యుత్తమ సేవలకు కేరాఫ్ అడ్రస్ గా తణుకులోని జిల్లా కేంద్ర ఆస్పత్రి నిలుస్తోంది. తణుకు పట్టణం చుట్టుపక్కల ఏడు మండలాల్లోని 110 గ్రామాలకు కూడలి ప్రాంతం. ప్రతిరోజు సుమారు 300 మంది పైగా రోగులు వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రికి తరలి వస్తారు. మహిళలకు అందించే ప్రసూతి వైద్య సేవల విషయంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా మెటర్నిటీ వార్డులను ఆధునికీకరించి సేవలందించడం విశేషం. పిల్లలకు అవసరమైన ఇంక్యుబేటరీ బాక్స్‌ల సదుపాయం కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం మరో విశేషం.
సేవలపై ఆరా... ఇటీవల... జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన నాణ్యతా ప్రమాణాల సంస్థకు చెందిన ప్రతినిధులు ఢిల్లీ, అగర్తల, తమిళనాడు నుంచి తరలివచ్చి మూడు రోజులపాటు ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని 15 విభాగాలలో పనితీరు పరిశీలించడంతోపాటు ఆసుపత్రి పరిపాలన, ఆసుపత్రి నిర్వహణ, పారిశుధ్య పరిస్థితులు తదితర అంశాల మీద క్షుణ్ణంగా పరిశీలించి ఉత్తమ ఆస్పత్రిగా గుర్తింపు ఇచ్చారు. 150 పడకలు గలిగిన ఈ ఆసుపత్రికి ఏటా 15 లక్షల రూపాయల చొప్పున మూడు సంవత్సరాల పాటు 45 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ నిధులను ఆసుపత్రిలో రోగులకు సదుపాయాలు కల్పించడానికి ఆస్పత్రి అభివృద్ధికి వినియోగించే అవకాశం ఉంది.