పేద గిరిజనులకు దక్కాల్సిన పోలవరం పునరావస(Polavaram compensation) ప్యాకేజీలోనూ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి జగన్ అవినీతికి పాల్పడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు. మచ్చా మహాలక్ష్మీ, మదకం సావిత్రల పేరు మీద తప్పుడు అకౌంట్లు, భూమి పత్రాలు సృష్టించి రూ.2.15 కోట్లు కాజేశారన్నారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ, పోలవరం అథారిటీ, సెంట్రల్ వాటర్ వర్క్స్ కమిషన్ తక్షణమే జోక్యం చేసుకొని పునరావాస ప్యాకేజీపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
అవినీతికి సబంధించిన వివరాలను పట్టాభి మీడియా ముందు బహిర్గతం చేశారు. "మచ్చా మహాలక్ష్మికి చెందిన 11ఎకరాల భూమికి రూ.1.16కోట్లు, మదకం సావిత్రి పేరు మీద 9.13ఎకరాలకు రూ.99.07లక్షలు 2020 జూలై 13న పరిహారం ఆమోదిస్తున్నట్లు ప్రొసీడింగ్స్ విడుదల చేశారు. అదే రోజున ఇరువురి పేరు మీద బ్యాంకు ఖాతాలు తెరిచారు. మచ్చా మహాలక్ష్మి పేరుతో సర్వే నెంబర్ 78లో, సావిత్రికి సంబంధించి సర్వే నెంబర్ 45, 77, 30లో భూమి ఉన్నట్లు పేర్కొంటూ ఈ పరిహారాన్ని 2020 డిసెంబర్ 14న ఇరువురి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఫామ్ 9 ప్రకారం పరిశీలిస్తే..సర్వే నెంబర్ 78, 45, 77, 30ల్లో ఎవరి పేరు మీద లేని భూమి (అన్ క్లైమ్డ్)గా నిర్ధరణ అయింది. అడంగల్ పహాణీ ప్రకారం మచ్చా మహాలక్ష్మి పేరు మీద ఎకరా భూమి మాత్రమే ఉంది. స్థానిక ఎమ్మెల్యే బాలరాజు, పీవోగా పనిచేసే సూర్యనారాయణ కుమ్మక్కై భద్రాచలం హెచ్డీఎఫ్సీ బ్యాంకులో తప్పుడు ఖాతాలు తెరిచి రూ.2.15 కోట్లు కాజేశారు. అక్కడి నుంచి డబ్బును వేరు వేరు ఖాతాలకు బదిలీ చేశారు. కలెక్టర్ లేదా న్యాయస్థానం ఆదేశాలు లేకుండా అన్క్లైమ్డ్ భూమిని బదిలీ చేయటం కుదరదు. బ్యాంకు ఖాతా తెరిచినట్లు కానీ పరిహారం అందినట్లు కానీ ఇద్దరు లబ్ధిదారులకు కనీస సమాచారం కూడా లేదు." అని పట్టాభి వ్యాఖ్యనించారు.
జలవనరులశాఖ మంత్రిని పోలవరం వద్ద నిర్వాసితులు పునరావాస ప్యాకేజీపై ప్రశ్నిస్తే కాకమ్మ కథలు చెప్పారని...,ఇప్పుడు ఈ ఆధారాలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు దక్కాల్సిన పరిహారం పక్కదారి పడుతోందన్నారు. అందుకు సబంధించిన ఆధారాలను త్వరలోనే బయటపెడతామని తెలిపారు.