ఈ ఖరీఫ్‌లో వరస విపత్తుల వల్ల లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని.. తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాలనలో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరికలతో నష్టనివారణ చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థలన్నింటిని నాశనం చేసిందని విమర్శించారు. మంత్రులు ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయాలకే పరిమితమయ్యారని పట్టాభి మండిపడ్డారు. రైతు భరోసా పేరిట ప్రభుత్వం అన్నదాతలను మోసం చేసిందని ఆరోపించారు.
పాలకుల చేతగానితనంతోనే ఇంత నష్టం: పట్టాభి - pattabhi comments on jagan
వరుస తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, పాలకుల ముందస్తు హెచ్చరికలు, సమీక్షలు నిర్వహించని కారణంగానే ఇంత నష్టం జరిగిందని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామంలో నీటమునిగిన వరిపొలాలను.. తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుతో కలిసి ఆయన పరిశీలించారు.
నివర్ తుపాన్ బాధితులకు రూ.500 మాత్రమే ఆర్థిక సాయం ప్రకటించడం దారుణమన్నారు. ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన గొన్నూరి నాగబాబు (24) శనివారం రైలు ఢీకొని మృతి చెందాడు. దీనిపై పట్టాభి స్పందిస్తూ.. నాగబాబు తన బంధువులతో కలిసి 25 ఎకరాలు కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తుంటే.. అధిక వర్షాలకు పంట నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడితే.. దానిని ప్రమాదంగా చెప్పడం బాధాకరమన్నారు. బాధితుడు కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... ఇంకా ముంపు నీటిలోనే పంట చేలు..గుండె చెరువైన అన్నదాత