సీఎం జగన్ ఆదేశాలు పాటించకపోతే తనకు నిద్రపట్టదనే వాస్తవాన్ని స్పీకర్ బయటపెట్టారని మాజీ మంత్రి జవహర్ అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తపిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. శాసనసభలో జరిగిన వాస్తవాలను ప్రజలు గమనించారని, జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు నిద్రలేక అశాంతికి గురవుతున్నారన్నారు. రైతు సమస్యలు, పింఛన్లపై చర్చించమంటే తెదేపా సభ్యులను సస్పెండ్ చేశారన్నారు. సీఎం జగన్ కారణంగా డీజీపీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.
ఇసుక కొరతతోనే దాడి
వైకాపా సృష్టించిన కృత్రిమ ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయిన నాగేశ్వరరావు మంత్రి పేర్ని నానిపై దాడికి పాల్పడ్డాడని తెదేపా అధికార ప్రతినిధి ఎన్.బి.సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఎలాంటి సంబంధం లేని కొల్లు రవీంద్రను.. ఈ కేసులోకి లాగటం ముమ్మాటికీ కక్షసాధింపు చర్యేనని మండిపడ్డారు. గతంలోనూ కుటుంబ కలహాలతో జరిగిన హత్య కేసును కొల్లు రవీంద్రకు ఆపాదించారని విమర్శించారు. తెదేపా అండగా ఉన్నారనే బీసీ నాయకులను వేధిస్తున్నారని సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కోడికత్తి, బాబాయి కేసులు గాలికొదిలి తెదేపా నేతలపై అక్రమ కేసులు పెట్టి అణగదొక్కాలనుకుంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.
పన్ను భారంపై ఉద్యమం : ఆరిమిల్లి
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా ప్రజల నడ్డి విరిగేలా వైకాపా ప్రభుత్వం పన్నులు విధిస్తుందని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. తణుకులోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలపై ఇంటిపన్ను, నీటి పన్ను, డ్రైనేజీ పన్నులను పెంచుతూ మూడు జీవోలు తెచ్చారన్నారు. ఇప్పటివరకు అద్దె ప్రాతిపదికన విధిస్తున్న ఇంటి పన్నులను కొత్త జీవో ప్రకారం ఆస్తి విలువ ఆధారంగా విధిస్తారని.. దీనివల్ల 10 నుంచి 50 రెట్ల వరకు పన్ను భారం పెరుగుతుందన్నారు. మంచి నీటి పన్నుతో పాటు నిర్వహణ ఖర్చులు అన్ని కలిపి పెంచుతున్నారన్నారు. డ్రైనేజీ నిర్వహణ ఖర్చుల పేరుతో డ్రైనేజీ పన్ను పెంచుతున్నారని ఆరిమిల్లి అన్నారు. ఆస్తిపన్ను, నీటి పన్ను, డ్రైనేజీ పన్నులను పెంచుతూ తీసుకువచ్చిన 198, 197, 196 జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోతే ప్రజల్లోకి తీసుకువెళ్లి ఉద్యమిస్తామని రాధాకృష్ణ హెచ్చరించారు.
అచ్చెన్న ప్రకటన
తెదేపా సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా పంతగాని నరసింహప్రసాద్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించినట్లు...తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి :ప్రజా సమస్యల్ని ప్రస్తావించటంలో తెదేపా విఫలం: బొత్స