Yanamala Ramakrishnudu two-page letter: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి సంబంధించి రెండు రోజుల క్రితం కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ నివేదికలో ‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాల్లో ఎక్కువ భాగం రుణాల చెల్లింపులు, రెవెన్యూ పద్దుల్లో లోటును భర్తీ చేసేందుకు వినియోగించడం వల్ల రాష్ట్రం సేకరించిన రుణాల ఉత్పాదక సామర్థ్యం తగ్గుతోంది. బడ్జెట్‌లో చూపకుండా ఇతర మార్గాల్లో తీసుకుంటున్న రుణాలను కూడా పరిగణిస్తే రాష్ట్ర రుణ చెల్లింపుల భారం విస్ఫోటక పథంలో పయనిస్తోంది' అంటూ పేర్కొంది. ఈ మేరకు కాగ్ నివేదికను బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత భయానకంగా ఉందో చూడండి అంటూ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..రెండు పేజీల లేఖను విడుదల చేశారు.
విడుదల చేసిన లేఖలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ''2021-22 కాగ్ నివేదిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఎత్తి చూపింది. ప్రభుత్వ ఆదాయ-వ్యయాలు, అప్పులు, అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ అసత్యాలు, అర్ధ సత్యాలేనన్న విషయం కాగ్ నివేదిక ద్వారా స్పష్టమైంది. మూలధన వ్యయం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సగటున 14.41% ఉండగా, రాష్ట్రంలో మాత్రం 9.21%కి పడిపోవడం జగన్ రెడ్డి విధ్వంసక విధానాలకు నిదర్శనం. రాష్ట్రంలో అభివృద్ధి పనులు అటకెక్కాయి. జీయస్‌డీపీలో రాష్ట్ర అప్పుల శాతం 20%కి మించకూడదని కేంద్ర ఎఫ్ఆర్బీయం చెబుతుంటే రాష్ట్ర అప్పులు మాత్రం 40%కి మించాయి. ఏ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోంది? రాష్ట్రానికి ఉన్న పరిమితి ఎంత? 4 ఏళ్లలో చేసిన అప్పులు ఎంత? తీసుకున్న అప్పుల్లో తిరిగి రుణ వాయిదాలకు, వడ్డీలకు చెల్లిస్తున్న మొత్తం ఎంత? అన్న విషయాలపై ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోంది. వస్తున్న ఆదాయానికి మించి ఖర్చులు పెరిగిపోయి తారాస్థాయికి చేరడంతో రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయింది. ఇది రాష్ట్ర భవిష్యత్‌కు గొడ్డలిపెట్టు లాంటిది. రూ.1,23,948 కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ (బడ్జెట్‌లో చూపెట్టనివి) ఉండడం క్లాసిక్ డెబ్ ట్రాప్‌కు సంకేతం. కొత్త అప్పుల్లో 80% మొత్తాన్ని పాత అప్పులు తీర్చేందుకే ఉపయోగిస్తున్న విషయం కాగ్ లెక్కల ద్వారా స్పష్టమైంది'' అని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.