cheating baba in west godavari: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని అనేక గ్రామాల్లో.. అన్నవరం సిద్ధాంతినంటూ ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. పూజల పేరుతో డబ్బులు వసూలు చేశాడు. నగదు ఇవ్వకుంటే కీడు జరుగుతుందని భయాందోళనకు గురి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటకృష్ణాపురంలో చిలుకూరి రాధాకృష్ణ ఇంటికి వెళ్లి బియ్యం బిక్షగా ఇవ్వాలని కోరారు. తాను అన్నవరం సిద్ధాంతి నని, ప్రతి గ్రామంలో 11 ఇళ్ల వద్ద కొంచెం బియ్యం భిక్షగా తీసుకొని షిరిడీలో గోవులకు నైవేద్యంగా పెడతానని చెప్పాడు. సిద్ధాంతి వచ్చిన విషయాన్ని సునీత తన భర్తకు ఫోన్లో చెప్పింది.
వెంటనే సిద్ధాంతిని ఆపమని చెప్పడంతో.. అప్రమత్తమైన సిద్ధాంతి అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో రాధాకృష్ణ అక్కడికి చేరుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు. పొంతనలేని సమాధానాలు చెబుతూ... అక్కడ నుంచి కారులో పరారాయ్యాడు. రాధాకృష్ణ సిద్ధాంతి కారును ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి ప్రజలను హెచ్చరించారు. అది చూసిన తిమ్మాపురం లో ఓ వ్యక్తి అదే సిద్ధాంతికి 16 వేల 500 రూపాయలు ఇచ్చానని... అదేవిధంగా అడమిల్లికి చెందిన మరో వ్యక్తి 10వేల రూపాయలు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై ఇప్పటివరకు భాదితులు ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అసలు వచ్చింది సిద్ధాంతా...లేక దొంగలా అయోమయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.