పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం వరిఘేడులో ఆర్ఎంపీ వైద్యుడు రాపాక నాని ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామ సర్పంచ్, పంచాయతీ సిబ్బంది వేధింపులకు గురి చేయటం వల్లే తాను అఘాయిత్యానికి పాల్పడ్డానని ఆరోపించాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ..తన ఆత్మహత్యాయత్నానికి కారకులెవరో పేర్లు చెబుతూ పురుగుల మందు తాగాడు. బంధువులు అడ్డుకుని తణుకు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఏం జరిగింది..
గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద చెత్త వేస్తుండటంతో నానితో పాటు మరి కొంతమంది కలిసి అధికారులకు ఫిర్యాదు చేశారు. విగ్రహం పరిసరాల్లో పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ సిబ్బంది ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుండగా.. అటుగా వెళ్లిన నాని.. చెత్తను తీసివేయటమే కాక, అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎవరూ చెత్తాచెదారాలు వేయకుండా ఇంటింటికీ ప్రచారం చేయాలని సూచించాడు. దీంతో అక్కడ ఉన్న సిబ్బందితో పాటు పంచాయతీ ప్రజా ప్రతినిధులు అతనిపై దౌర్జన్యం చేయబోయారు. గ్రామంలో ఉండనివ్వబోమంటూ హెచ్చరించారు. దీంతో మనస్తాపం చెందిన నాని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
అంబేడ్కర్ విగ్రహం వద్ద చెత్త వేయకూడదని చెప్పినందుకు మా అన్నని చంపేస్తామని బెదిరించారని బాధితుడి తమ్ముడు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలని కోరాడు.
ఇదీ చదవండి:CORONA: కరోనా లక్షణాలున్న మావోయిస్టులకు సహకరిస్తాం: ఎస్పీ కృష్ణారావు