బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన నరసాపురం సబ్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్... నరసాపురం డివిజన్ పరిధిలోని మండల స్థాయి అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు డివిజన్ పరిధిలోని అన్ని మండల తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని... ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. ఫోన్ నంబరు 08814 - 276699 సంప్రదించాలన్నారు.
తీరం దాటే అవకాశం...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో నరసాపురం, విశాఖపట్నం మధ్య కాకినాడ దగ్గరలో ఈ నెల 13న తెల్లవారుజామున తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించారని సబ్ కలెక్టర్ వివరించారు.
సిద్ధంగా ఉండాలి..
దీని ప్రభావంతో తీరం వెంబడి బలంగా గాలులు వీయటంతోపాటు భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరం అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు మిగతా శాఖల అధికారుల సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఎలాంటి ఇబ్బంది ఉన్న వెంటనే కంట్రోల్ రూంకి సమాచారం ఇవ్వాలన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.