Student reached AP from Ukraine : ‘ప్రస్తుత దశలో మీ దేశం తీసుకున్న నిర్ణయం సరిగాలేదని నిందిస్తూ ఉక్రెయిన్ సైనికులు ఉక్రోషంతో రగిలిపోతున్నారు. అమ్మాయిలని చూడకుండా తుపాకులతో నెట్టి కొడుతున్నారు. ఈ క్రమంలోనే ఒకచోట కింద పడిపోయా’ అని ఉక్రెయిన్ నుంచి స్వస్థలమైన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు చేరుకున్న వైద్య విద్యార్థిని ఇజ్జని జ్యోత్స్న వంశీప్రియ పేర్కొన్నారు.
భారత ప్రభుత్వం సమకూర్చిన ప్రత్యేక విమానంలో గురువారం అర్ధరాత్రి విశాఖపట్నంలో దిగిన ఆమె శుక్రవారం ఉదయం చిలుకూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘యుద్ధం ప్రారంభమయ్యాక భద్రత కోసం బంకర్‌లోకి వెళ్లేవాళ్లం. మా కళాశాల సమీపంలో బాంబుదాడి జరగడంతో మమ్మల్ని స్వస్థలాలకు పంపాలని విశ్వవిద్యాలయ అధికారులపై ఒత్తిడి తెచ్చాం. తర్వాత సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరం వరకు బస్సులో వచ్చాం. జిల్లా కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులు ఫోన్‌లో మాతో మాట్లాడి ధైర్యం చెప్పారు’ అని జ్యోత్స్న వంశీప్రియ తెలిపారు.