STUDENTS HOSPITALIZED DUE TO FOOD POISON IN TANUKU : మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు.. ఆసుపత్రి పాలైనా ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. తణుకు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజనంగా పొంగలి, సాంబార్ అన్నం, కోడిగుడ్డు పెట్టారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఐదుగురు విద్యార్థులకు వాంతులు అయ్యాయి. దీంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు 108 వాహనంలో తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారితో పాటు మరో 12 మంది విద్యార్థులనూ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు స్పందించి చికిత్స అందించటంతో విద్యార్థులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
జరిగిన ఘటనపై విద్యా శాఖ అధికారులు పాఠశాలను సందర్శించి, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులు అందరూ క్షేమమని జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని మండల విద్యా శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతమున్న వంట ఏజెన్సీని రద్దు చేసి కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
వాంతులతో విద్యార్థులు ఆసుపత్రికి వచ్చారని.. వారికి అవసరమైన చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. ఐదుగురు విద్యార్థులకు సెలైన్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఆహారం కలుషితం వల్ల ఏర్పడిన ఇబ్బంది కాదని, ఆహారం సరిగ్గా అరుగుదల కాకపోవడం వల్ల వాంతులు అయి ఉండొచ్చని హాస్పిటల్ సూపరింటెండెంట్ శివ ప్రసాద్ వెల్లడించారు.