ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాఫ్ట్‌వేర్‌ సుబ్రమణ్యం.. ఆదర్శ వ్యవసాయం - news on west gidavari farmer

ఆ యువకుడి అడుగుల సవ్వడికి పంటచేలు వయ్యారంగా నృత్యం చేస్తాయి. పైరగాలి పరవశించి.. సాదరంగా స్వాగతం పలుకుతుంది. భూమి, నీరు ఆప్యాయంగా కబుర్లాడుతాయి. రసాయన సంకెళ్ల నుంచి విముక్తినిస్తున్న... ఆ సాఫ్ట్‌వేర్ యువకుడికి ప్రకృతి సైతం దాసోహమంటోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి పొలం ఒడిలో హలం పట్టి.. 54 దేశవాళీ వరి రకాలతో సేంద్రియ సాగు చేస్తున్న ఆ యువ కర్షకునిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

story on west godavari farmer subrahmanyam doing organic farming
పశ్చిమగోదావరిలో సాప్ట్​వేర్​ సుబ్రమణ్యం ప్రకృతి సాగు

By

Published : Dec 17, 2019, 9:59 PM IST

పశ్చిమగోదావరిలో సాప్ట్​వేర్​ సుబ్రమణ్యం ప్రకృతి సాగు

అధిక దిగుబడుల మోజులో పడి ప్రజలు ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. సాగులో వస్తున్న మార్పులు సైతం.. అనేక జబ్బులు వెంట తెస్తున్నాయి. ఈ విపత్తుపై పరిశోధన సాగించి అద్భుత ఫలితాలు సృష్టిస్తున్నాడు పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు సుబ్రమణ్యం. మంచి జీతం, ఉన్నత స్థానం ఉన్నా అసంతృప్తితో ఉన్న ఆయన.. తనకు ఇష్టమైన వ్యవసాయం బాట పట్టారు. రసాయన సాగుకు బదులు.. దేశీయ వంగడాలు తీసుకురావడానికి నడుం కట్టారు. దేశవాళి వరి రకాలు సేకరించి.. స్వచ్ఛమైన పాలేకర్ ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టారు. తనకున్న 15 ఎకరాల పొలంలో 54 రకాల దేశావళి వరిరకాలు సాగుచేస్తున్నారు.

వ్యవసాయంపై ప్రాథమిక పరిజ్ఞానంలేని సుబ్రమణ్యం.. తోటి రైతులు ఔరా అనేలా సాగు చేస్తున్నారు. సేంద్రియ సాగు చేపట్టాలన్న ఇష్టంతో టీసీఎస్‌లో ఉద్యోగాన్ని వదులుకొన్నారు. ప్రకృతి సాగు చేయాలని నిశ్చయించుకొన్నారు. దేశావళి వంగడాలను సేంద్రియ విధానంతో పండించి.. వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకొన్నారు. తోటి రైతులు అపహాస్యం చేసినా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా పొలంలోకి దిగి... వారితోనే ఔరా అనిపించుకొంటున్నారు. శాస్త్రవేత్తగా మారి దేశవాళి వరివంగడాలు సాగులో మెళకువలు ఇతరులకు సైతం అందిస్తున్నారు.

దేశీ వరివంగడాల కోసం దేశం నలుమూలల గాలించారు. ఒడిశా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబంగా తదితర ప్రాంతాల నుంచి వరి వంగడాలు సేకరించారు. సుబ్రమణ్యం తనపొలంలో ప్రతి వంగడానికి నారుమడి వేయించారు. ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు లేకుండా వరినాట్లు వేశారు. ఈ ప్రయత్నం సత్ఫలితాన్ని ఇచ్చింది. సాధారణ రకాల కంటే పంట ఏపుగా పెరిగింది. జిల్లా నలుమూలల నుంచి రైతులు ఆయన పొలాన్ని చూడడానికి వస్తున్నారు. సమీకృత సేద్యం విధానంలో వరి పొలంలోనే చేపలు పెంచుతున్న తీరుకు ఆశ్చర్యపోతున్నారు.

వ్యవసాయానికి నేటి యువత దూరమవుతోంది.. భవిష్యత్తులో వ్యవసాయం చేసే నాథుడే కరువయ్యే పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. అలాంటిది సుబ్రమణ్యం మాత్రం.. ప్రకృతి ఒడిలో వ్యవసాయం చేపట్టి.. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

ఇదీ చదవండి

అగ్గిపెట్టెలో చీర... అందరి మనసులు దోచింది

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details