రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది రైతులకు 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్‌బాబు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని సంస్థ యూనిట్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన..ఇప్పటివరకు సంస్థ వరితో పాటు అపరాల పంటలకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. రానున్న రోజుల్లో వరి, అపరాలు పంటలతో పాటు వాణిజ్యపరంగా కూరగాయలు, నారు సంబంధిత విత్తనాలను కూడా ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యమన్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర నుంచి కూడా విత్తనాలు కావాలని అడుగుతున్నట్లు వెల్లడించారు.
తణుకు యూనిట్ సంస్థకు గుండెకాయ లాంటిదని ఆయన పేర్కొన్నారు. తణుకు యూనిట్లో 50 వేల క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి అవుతుండగా..వచ్చే సంవత్సరం నుంచి లక్ష క్వింటాళ్ల విత్తనాలను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యమన్నారు. లక్ష్య సాధనలో రైతులు, సిబ్బంది భాగస్వాములు కావాలని ఎండీ శేఖర్‌బాబు పిలుపు నిచ్చారు.