తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్ధంపై నిరసన తెలియజేసినందుకు అరెస్టైన వారిని తక్షణమే విడుదల చేసి... కేసులు ఎత్తివేయాలని పశ్చిమగోదావరి జిల్లా భాజపా అధ్యక్షుడు నార్ని తాతాజీ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం భాజపా- జనసేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అంతర్వేదిలో నిరసన తెలియజేసినందుకు 37 మందిని జైలుకు పంపడం రాష్ట్ర ప్రభుత్వ పైశాచికత్వానికి నిదర్శనమని తాతాజీ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలు మానుకుని వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర నాయకుడు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, ఆకుల ఆంజనేయులు, పేరిచర్ల సుబాష్, గుడాల ఈశ్వర్,జనసేన నాయకులు పోలిశెట్టి సాంబ, నళిని, కోపల్లి శ్రీనివాసు, అరేటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.