కరోనా వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం రికార్డు సృష్టించింది. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నిన్న ఒక్కరోజే 13,59,300 మందికి టీకాలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో లక్ష మందికి పైగా టీకా పంపిణీ జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,64,308 మందికి వ్యాక్సిన్ అందింది. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 63,314 మందికి వ్యాక్సిన్ వేశారు. ఎనిమిది నుంచి 10 లక్షల మందికి టీకా వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. మొత్తం 13.59 లక్షల మందికి వేయగలిగింది. గతంలో ఒకే రోజు 6 లక్షల మందికి టీకా వేయగా.. ఇప్పుడు రెట్టింపు సంఖ్యను దాటి వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్యారోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. సీనియర్ అధికారులను జిల్లాలకు పర్యవేక్షకులుగా పంపింది. కలెక్టర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయించారు. అర్హులకు ముందుగానే టోకెన్లు పంపిణీ చేయడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొత్తం సాఫీగా సాగింది. నిన్నటివరకు రాష్ట్రంలో తొలి, రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య కోటి 36 లక్షల 75వేల 909కి చేరింది. కేంద్రం నుంచి వచ్చిన టీకాలను రాష్ట్రంలోని టీకా కేంద్రాలకు తరలించేందుకు పటిష్టమైన గొలుసు వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు.