రైతులతోపాటు దేశానికీ అధిక ఆదాయం తెచ్చేదిగా చెప్పుకొనే ఆక్వా రంగం... పెను విధ్వంసాన్నే సృష్టిస్తోంది. లక్షల ఎకరాలను నిస్సారంగా మారుస్తోంది. ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా ధాటికి పచ్చని మాగాణి.. ఉప్పు నేలగా మారుతోంది. మూడు పంటలు పండే గోదావరి డెల్టా భూముల్లో.. గడ్డి మొలవని దురావస్థ దాపురించింది. పట్టణాలు, గ్రామాల విస్తరణతో కుచించుకుపోతున్న డెల్టాను.. చేపల చెరువులు, రొయ్యల చెరువులు మరింత దెబ్బతీస్తున్నాయి.
జిల్లాలో రొయ్యల చెరువుల తవ్వకాలపై నిషేధం ఉంది. నిర్దేశించిన విస్తీర్ణం కంటే ఎక్కువగా ఆక్వా చెరువులు తవ్వడమే వీటన్నింటికీ కారణమవుతోంది. రాజకీయ అండదండలతో ఇప్పటికీ ఇష్టానుసారం తవ్వకాలు జరుగుతున్నాయని రైతులు అంటున్నారు. ఈ వేసవిలోనే సుమారు 22 వేల ఎకరాలకుపైగా డెల్టా భూములు ఆక్వా చెరువులుగా మారాయని అధికారులే చెబుతున్నారు. పాలకొల్లు, నరసాపురం, ఉండి, అత్తిలి, పెనుగొండ, వీరవాసరం, పెనుమంట్ర, పెరవలి, కాళ్ల, ఆకివీడు ప్రాంతాల్లో శరవేగంగా విస్తరిస్తున్నాయి. భూములు లీజుకు తీసుకుని చెరువులు తవ్వేందుకు ప్రత్యేక మాఫియా తయారైందని రైతులు ఆరోపిస్తున్నారు. ముంపు ప్రాంతాలు, ఉప్పు నేలల్లో మాత్రమే ఆక్వా చెరువులు ఏర్పాటుచేయాలనే నిబంధనలు బేఖాతరు చేస్తున్నట్లు చెబుతున్నారు.