పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా పాడి పశువుల పెంపకానికి ప్రత్యామ్నాయంగా పౌల్ట్రీ పరిశ్రమ ఎదుగుతూ వచ్చింది. 40, 45 ఏళ్ల కిందటి వరకు వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పాడి పశువులు పెంచేవారు. పశువుల పెంపకం భారం కావటంతో క్రమేపీ పశువుల స్థానం కోళ్ల పరిశ్రమలను ఏర్పాటుచేసి విస్తరించుకుంటూ వచ్చారు. మొదట్లో పౌల్ట్రీ పరిశ్రమపై చెప్పుకోదగ్గ లాభాలే వచ్చేవి.
18 నెలలుగా సంక్షోభం
అయితే గడిచిన 18 నెలలుగా పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2019వ సంవత్సరంలో మొక్కజొన్న దాణా రేటు కిలో రూ. 17 రూపాయల నుంచి రూ. 24 రూపాయలకు చేరింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాణా రేటు పెరిగిపోయి తదనుగుణంగా గుడ్డు గిట్టుబాటు ధర పెరిగింది. ఆ స్థాయిలో మార్కెట్ ధర పెరగకపోవటంతో రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో పరిశ్రమ కోలుకునే అవకాశం ఉంటుందని భావించారు. అయితే కోడిగుడ్డు, కోడి మాంసం తింటే కరోనా వస్తుందనే వదంతులు పౌల్ట్రీ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావం చూపించాయి. ఫలితంగా ఫిబ్రవరిలో కోడి గుడ్డు ధర అట్టడుగు స్థాయికి పడిపోయింది. ఇది రైతుల్ని మరింత డీలా పడేలా చేసింది. మార్చి నెలలో మొదలైన లాక్ డౌన్ రైతుల పాలిట శాపంగా మారింది. జూన్ నెల వరకు దుర్భర పరిస్థితులు కొనసాగాయి. అప్పటి నుంచి పరిస్థితులు కొంత మెరుగుపడి ఆగస్టు చివరి వారంలో గుడ్డు ధర పెరిగింది. గుడ్డు ధర పెరిగినా వచ్చే మిగులు కనీసం వడ్డీలకు కూడా సరిపోదని రైతులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం పర్వాలేదు
ప్రస్తుతం ఉత్పత్తి తక్కువగా, వినియోగం ఎక్కువగా ఉండటంతో గుడ్డు ధర పెరిగింది. వల్ల వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల గుడ్డు ధర పెరిగింది. స్థానిక వినియోగం పెరగడం ధరలు పెరగడానికి కారణమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహారం పేరుతో కోడిగుడ్లను అంగన్వాడీలకు, పాఠశాలకు భారీ స్థాయిలో కొనుగోలు చేయడం వల్ల పరిశ్రమకు కొంత ఉపశమనం కలిగింది. ప్రస్తుతం కోడి గుడ్డు ధర పెరిగినా గత 18 నెలల కాలంలో కలిగిన నష్టాన్ని పూడ్చుకునే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం సున్నా వడ్డీ రాయితీ, సబ్సిడీ ధరకు మొక్కజొన్న సరఫరా వంటి సదుపాయాలు కల్పించి పరిశ్రమను ఆదుకోవాలని రైతులు, పౌల్ట్రీ యజమానులు కోరుతున్నారు.