పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురంలో.. ఆస్తి తగాదా విషయంలో కన్న తండ్రినే అతి కిరాతకంగా హత్య చేశాడో కుమారుడు. తనకు పంచి ఇచ్చిన పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నుతుండగా.. చిన్న కుమారుడు కత్తితో తండ్రి బళ్లా లక్ష్మీనారాయణ మెడపై బలంగా నరికాడు. నోటి నుంచి సగం మేర తల తెగిపోయి.. తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు.
పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న లక్ష్మీనారాయణకు రెండున్నర ఎకరాలు భూమి ఉంది. ఇద్దరు కుమారులకు కొంత పంచి ఇచ్చి.. మిగిలిన దానిలో సేద్యం చేస్తూ ఉండేవాడు. చిన్న కుమారుడు ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టగా.. తండ్రి నుంచి లక్షల రూపాయలను తీసుకున్నాడు. వాటిని తిరిగి ఇవ్వాలని అడగుతుండటంతో.. తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తన భూమిని తనే సాగు చేసుకుంటానని దుక్కి దున్నుతున్న తండ్రిపై.. కుమారుడు కత్తితో దాడిచేసి హతమార్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.