ఇళ్ల స్థలాల పేరిట వైకాపా నేతలు రూ.5వేల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన..కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా ఆర్థిక ఇబ్బందులతో అభివృద్ధి కుంటుపడుతోందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై భాజపా ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడతామని చెప్పారు.
"భాజపా అధికారంలోకి వస్తే తక్కువ ధరకే ఇసుక అందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్లే అభివృద్ధి, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. కాకినాడలో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పడితే ప్రత్యక్షంగా 2 లక్షల మందికి, పరోక్షంగా మరో 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు చేరువవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఆ ప్రాజెక్టు నిలిచింది. టిడ్కో ఇళ్లను కేంద్ర ప్రభుత్వ సాయంతో పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం." అని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షం జనసేనతో కలిసి ముందుకెళ్తామన్నారు.