పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో జోరుగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే పొలాల్లోని మట్టిని తీసుకెళ్లి ప్రైవేటు భూములను చదును చేయడానికి అమ్మేస్తున్నారు. మండలంలోని తల్లాపురం, చేబ్రోలు, నారాయణపురం, యర్రమళ్ల, అక్కుపల్లి గోకవరం కాకర్లమూడి, నీలాద్రిపురం, గోపీనాథపట్నం గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ఉంగుటూరు తహసిల్దార్ కార్యాలయంలోని ఒక అధికారి.. ఒక్కో జేసీబీ యంత్రానికి రూ.4 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆరోపిస్తున్నారు. మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకోవడానికి వెళ్లిన ఆర్టీవో అధికారికి... భారీ మొత్తంలో నగదు అప్పజెప్పారని స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.