పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కరోనా వైరస్‌పై అవగాహనకు కొందరు సామాజిక కార్యకర్తలు నడుం బిగించారు. పదిహేడు రోజులుగా లాక్డౌన్ కొనసాగుతున్నా.. ప్రజల్లో మార్పు అంతంత మాత్రంగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు, యమభటుల వేషధారణలో ప్రధాన రహదారుల్లో సంచరించారు. లాక్ డౌన్ పట్టింపు లేకుండా.. భౌతిక దూరం పాటించకుండా గుమిగూడిన వారందరికీ హెచ్చరికలు జారీ చేశారు.
బయటకి వస్తే మాస్కులు ధరించాలని, దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. అలా లేకుంటే అంతా తమ వద్దకే (యమలోకం) రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. యమలోకానికి వచ్చిన తర్వాత కోవిడ్ నిబంధనలు పాటించనందుకు ఎటువంటి శిక్షలు విధించాలన్నది తమ శిక్ష్మాస్మృతి ప్రకారం నిర్ణయిస్తామంటూ భయపెడుతున్నారు. యమగణాన్ని చూసి కొందరు నవ్వుకున్నా, పరిస్థితి అదుపులోకి రావటానికి ఇటువంటి అవగాహనలు అవసరమేనంటూ మరికొందరు అభినందిస్తున్నారు.