ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Slight change in district names : పలు జిల్లాల పేర్లలో స్వల్ప మార్పు - ఏపీలో జిల్లాల పేర్లలో మార్పు

Slight change in district names : కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం... ప్రతి జిల్లాకు వేర్వేరుగా ముసాయిదా ప్రకటనలు జారీ చేసింది.ఈ ప్రతిపాదనలపై స్థానికులకు ఏమైనా అభ్యంతరాలున్నా, సూచనలు చేయాలనుకున్నా 30 రోజుల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్‌లకు తెలియజేయాలని ప్రభుత్వం పేర్కొంది.

ap
ap

By

Published : Jan 27, 2022, 3:36 AM IST

Slight change in district names : కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం... ప్రతి జిల్లాకు వేర్వేరుగా ముసాయిదా ప్రకటనలు జారీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వరుసగా 26 జిల్లాలకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ ప్రతిపాదనలపై స్థానికులకు ఏమైనా అభ్యంతరాలున్నా, సూచనలు చేయాలనుకున్నా 30 రోజుల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్‌లకు తెలియజేయాలని ప్రభుత్వం పేర్కొంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పేర్లకు సంబంధించి మంగళవారం రాత్రి మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండానికి, ఆ తర్వాత జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్లలో పేర్కొన్న దానికీ స్వల్ప తేడాలున్నాయి.

కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు తూర్పుగోదావరి జిల్లా అని, రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు రాజమహేంద్రవరం జిల్లా అని పేరు పెట్టినట్లు మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండంలో పేర్కొన్నారు. ఏలూరు కేంద్రంగా ఉన్న జిల్లాకు పశ్చిమగోదావరి అని, భీమవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు నరసాపురం జిల్లా అని పేరు పెట్టినట్లు తెలిపారు. గెజిట్‌ నోటిఫికేషన్లలో మాత్రం... కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు కాకినాడ జిల్లా అని, రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు తూర్పుగోదావరి జిల్లా అని పేరు పెట్టినట్లుగా పేర్కొన్నారు. ఏలూరు కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు ఏలూరు జిల్లా అని, భీమవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు పశ్చిమగోదావరి అని పేరు పెట్టినట్లుగా తెలిపారు. మంగళవారం రాత్రి కేబినెట్‌ సమావేశం ముగిశాక, ఈ మార్పులు చేసినట్లు తెలిసింది. రాజమహేంద్రవరం, భీమవరం కేంద్రాలుగా ఏర్పాటయ్యే జిల్లాల్లో ఎక్కువ భాగం గోదావరి నదిని ఆనుకుని ఉన్నందున... వాటికి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలని పేర్లు పెట్టాలని కొందరు మంత్రులు చేసిన సూచన మేరకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే రెండు జిల్లాల్లో రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కూడా కొన్ని మార్పులు జరిగాయి. ప్రకాశం జిల్లాలో కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేబినెట్‌ మెమోరాండంలో పేర్కొనగా, గెజిట్‌ నోటిఫికేషన్‌లో కనిగిరి పేరు తీసేశారు. కొత్తగా పొదిలి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటయ్యే శ్రీసత్యసాయి జిల్లాలో పెనుగొండ, పుట్టపర్తి, కదిరి రెవెన్యూ డివిజన్లు ఉంటాయని పేర్కొనగా, గెజిట్‌ నోటిఫికేషన్‌లో మాత్రం పెనుగొండ, పుట్టపర్తితోపాటు ధర్మవరం రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్తర్వుల్లో అక్షరాల సవరణ

కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్తర్వుల్లో దొర్లిన అక్షరదోషాలను రెవెన్యూ శాఖ బుధవారం సవరించింది. స్థానికంగా వాడుకలో ఉన్నట్లు పేర్లలో మార్పులు చేర్పులు చేసింది. తిరుపతి అర్బన్‌ జిల్లా విషయంలో ఆంగ్లంలో చివరి అక్షరాలను ‘టీహెచ్‌ఐ’ అని పేర్కొన్నారు. సవరించిన జీఓలో దానిని ‘టీఐ’గా పేర్కొన్నారు. ఇలా అన్ని జిల్లాల్లో ఆంగ్ల అక్షరాల్లో మార్పుచేర్పులు వంద వరకు జరిగాయి. అర్థం ఒకటే అయినా, స్థానికంగా వినియోగంలో ఉన్న భాషలో ఉండేలా సవరించినట్లు అధికారులు తెలిపారు. ఎస్‌పీఎస్‌ నెల్లూరు జిల్లా అని తొలుత పేర్కొన్నారు. దానిని ఇప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. అలాగే వైఎస్‌ఆర్‌ కడప అని తొలుత పేర్కొనగా దానిని ప్రస్తుతం వైఎస్సార్‌ జిల్లాగా సవరించారు. మండలం పేరును బీఎన్‌ కండ్రిగ అని పేర్కొనగా దానిని బుచ్చినాయుడు కండ్రిగగా మార్చారు. ఉత్తర్వుల్లో డ్రాఫ్ట్‌ ఫార్మ్‌-1 అన్న పదాలు తొలగించి, ఫార్మ్‌-1గా గుర్తించాలని సవరించిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి

AP New Districts : జిల్లాల విభజనపై అసంతృప్తి... సుదీర్ఘకాల డిమాండ్లను పట్టించుకోలేదని వాదన

ABOUT THE AUTHOR

...view details