ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చౌడు భూముల్లో.. సిరుల పంటలు! - Seed crop cultivation with nuclear seed

చిన్న ఖాళీ జాగాను సైతం వినియోగంలోకి తీసుకువచ్చి అందాన్నిచ్చే రకరకాల పూల మొక్కలతో పాటు.. ఆదాయాన్ని అందించే రకరకాల పంటల సాగుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తాజాగా చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని కేవీకే ప్రాంగణంలో మిగిలి ఉన్న కొద్దిపాటి చౌడు భూములను సారవంతం చేసి పచ్చదనంతో నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

fields
fields

By

Published : May 9, 2021, 5:00 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని కేవీకే ప్రాంగణంలో ఉన్న కొద్దిపాటి చౌడు భూములను సారవంతం చేసి.. పచ్చదనంతో నింపేందుకు.. శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. రకరకాల పూల మొక్కలతో పాటు.. ఆదాయాన్ని అందించే రకరకాల పంటల సాగుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు.

న్యూక్లియర్‌ సీడ్‌తో విత్తన పంట సాగు

కొన్నిరోజుల క్రితం రజతోత్సవాలు జరుపుకొన్న ఉండి కృషి విజ్ఞాన కేంద్రానికి 37.50 ఎకరాల భూములున్నాయి. ఇందులో 20 ఎకరాల్లో వరి విత్తనోత్పత్తి జరుగుతోంది. ఈ భూమిలో మార్టేరు వరి పరిశోధన స్థానం అందించిన న్యూక్లియర్‌ సీడ్‌తో విత్తన పంట సాగు చేస్తున్నారు. దీనిలో నిర్దేశించిన లక్ష్యానికి మించి విత్తనోత్పత్తి జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ పండిన విత్తనాలను మార్టేరు వరి పరిశోధన స్థానానికి తరలించి రైతులకు విక్రయిస్తున్నారు. మరో 5 ఎకరాల విస్తీర్ణంలో తవ్విన చెరువుల్లో చేప పిల్లలు పెంచి మత్స్య రైతులకు సరఫరా చేస్తున్నారు.

ప్రదర్శన క్షేత్రాల్లో మేటి..

విస్తరణ కార్యక్రమాల అమలులో ఉండి కేవీకేకి మంచి గుర్తింపు ఉంది. కొర్రలు, అండు కొర్రలు, సామ, రాగి, బొబ్బర, అపరాలు, జామ, మొక్కజొన్నతో రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, వివిధ రకాల పూల మొక్కల పెంపకంపై ఏర్పాటు చేస్తున్న ప్రదర్శనా క్షేత్రాలు రైతులను ఆకట్టుకుంటున్నాయి. ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో 20 రకాల ఔషధ మొక్కల పెంపకాన్ని ఆరు నెలల కిందట చేపట్టారు. తేనెటీగల పెంపకం కేంద్రంపై ప్రత్యేకించి పార్కు ఏర్పాటు చేశారు. షెడ్‌ నెట్‌ల్లో వివిధ రకాల కూరగాయలు సాగుచేస్తున్నారు.

నీటి నిల్వలు పెంచేలా..

కేవీకేలో ఖాళీగా ఉన్న రెండెకరాల చౌడు భూమిని సారవంతం చేసేందుకు నాలుగేళ్లుగా జీలుగ, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లు సాగు చేస్తూ అంతర కృషి చేస్తున్నారు. ఈ భూమికి నీటి సదుపాయాన్ని కల్పించేందుకు అవసరమైన బోదెల తవ్వకం పనుల కోసం ఇటీవల ప్రతిపాదించారు. రైతు భవన్‌కు ఆనుకొని ఉన్న ఖాళీ జాగాలో మంచినీటి చెరువు తవ్వనున్నారు. ఇక్కడి నుంచి ఉద్యాన పంటలు, అన్నిరకాల ప్రదర్శన క్షేత్రాలకు అవసరమైన సాగునీటిని పూర్తి స్థాయిలో అందించేందుకు కొత్తగా కాలువ తవ్వించనున్నామని కేవీకే ప్రధాన శాస్త్రవేత్త మల్లికార్జునరావు తెలిపారు. దీనికి వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అనుమతి లభించిందన్నారు. నేల చదును చేసిన తర్వాత పంటల సాగు ప్రారంభిస్తామని చెప్పారు. షేడ్‌ నెట్‌లో అలంకరణ, కూరగాయల మొక్కల పెంపకాన్ని చేపడతామని తెలిపారు. అల్లం సాగుపై ప్రత్యేకించి ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తామని మల్లికార్జునరావు వివరించారు.

ఇదీ చదవండి:

కరోనా రోగులకు అన్నదానం.. కమిటీగా ఏర్పడి సాయం!

ABOUT THE AUTHOR

...view details