సంక్రాంతి రద్దీ.. ప్రయాణసాధనాలను కిటకిటలాడిస్తోంది. విశాఖ వైపు వచ్చే అన్ని రైళ్లలో రిజర్వేషన్లు 3 నెలల ముందుగానే భర్తీ అయ్యాయి. గోదావరి ఎక్స్‌ప్రెస్ లాంటి రైళ్లకు స్లీపర్ క్లాస్‌లో 600 వరకు వెయిట్ లిస్ట్‌తో... రిగ్రెట్ వెయిట్‌లిస్ట్ సమాచారం దర్శనమిస్తోంది. ఇక హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో 19వ తేదీ ఆదివారం నాటికి విమానం టిక్కెట్టు ధర ఇప్పుటికే రూ.18 వేలకు చేరుకుంది. బస్సుల టిక్కెట్ల ధరలూ 3 నుంచి 4 వేలకు చేరుకున్నాయి.
సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లాలన్న వారికి ప్రయాణసాధనాలన్నీ కిక్కిరిసి కన్పిస్తున్నాయి. రిజర్వేషన్ల పట్టికలన్నీ ఇప్పటికే రిగ్రెట్ వెయిట్లిస్ట్కి చేరుకున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఉత్తరాంధ్ర వైపు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చే గోదావరి, విశాఖ, ఫలక్‌నుమా వంటి ప్రధాన రైళ్లలో కనీసం వెయిటింగ్ లిస్ట్‌లోనూ అవకాశమే లేదు. ఉన్నత శ్రేణి... దురంతో ఎక్స్‌ప్రెస్‌లోనూ వెయిటింగ్ లిస్ట్ 300 దాటి ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.