పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం బియ్యపుతిప్ప నుంచి మొగల్తూరు మండలం మొల్లపర్రు వరకు 19 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది. తీరం ఆనుకొని ఉన్న 9 గ్రామాల ప్రజలకు ఉప్పు సాగే జీవనాధారం. ఈ తీరంలో ఉప్పు సాగు జనవరి మొదటి వారంలో ప్రారంభమైంది. ఇప్పుడు పంట అందుబాటులోకి వచ్చింది. రెండు నెలల వ్యవధిలోనే ధర పతనమైంది. ఇది రైతులను కుంగదీస్తోంది.
నిర్మలమ్మ దత్తత తీసుకున్నా.. దక్కని ఫలితం
జిల్లాలోని పీఎం లంక, తూర్పు తాళ్ళు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామాలు. ఆమె చొరవతో సాల్ట్ కమిషన్ అధికారుల ఇక్కడ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉప్పు సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. అయినా ఆధునిక పద్ధతులు అమల్లోకి రాలేదు.
ప్రభుత్వం నుంచి నిరాశే...
ఇప్పటివరకు ఉప్పు సాగును పంటగా ప్రభుత్వం గుర్తించలేదు. సాయం అందడం లేదు. సాగు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. అదే వ్యాపారులు పంటను నచ్చిన ధరకి తీసుకుంటున్నారు. మద్దతు ధర అడిగితే అప్పులు తీర్చమని ఒత్తిడి చేస్తున్నారు. ఇలా దళారుల దందా, తూకాల్లో మోసాలు, వడ్డీ వ్యాపారలు ఆగడాలతో ఉప్పు రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు.
నేటికీ ఉప్పు మడుల వద్దకు వెళ్లేందుకు సరైన రవాణా మార్గాలే లేవు. విద్యుత్ సౌకర్యం, ఉప్పును భద్రపరచే గోదాంల సౌకర్యాలు లేవు. ఫలితంగా పండించిన పంటను రహదారి సమీపంలోకి తరలించడం భారంగా మారుతోంది.
రైతులు కోరుకుంటున్నది..
జిల్లాలో 2004 నుంచి పరిశీలిస్తే భారీ వర్షాలు కాకుండా పది సార్లు విపత్తులు సంభవించాయి. ఆరు వేల ఎకరాల్లో సుమారు రూ.3 కోట్లు వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా సాయం అందలేదు. దీని వల్ల ఉప్పు సాగుబడి తగ్గుతూ వస్తోంది. దీన్ని పంటగా గుర్తించి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆధునిక పద్ధతులు అమలుతోపాటు సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి:నందిగామలో కొండముచ్చును కాపాడిన 'మానవ'త్వం