Salt farmers affected by rains: అకాల వర్షం ఉప్పు రైతులనూ నష్టపరిచింది. ఉప్పు సాగునే నమ్ముకున్న రైతులకు ప్రస్తుతం నెలకొన్న అననుకూల వాతావరణంతో ఉపాధి కరువై తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి ప్రభుత్వపరంగా సహాయ సూచనలు కూడా అందడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం మండలం పెదమైనవానిలంకలో గ్రామంలో ఉప్పు సాగు రైతులతు అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. గతంలో నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని కేపీపాలెం సౌత్, తూర్పుతాళ్లు, పీయంలంక తదితర గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాల్లో రైతులు ఉప్పు సాగు చేసేవారు. సాగు గిట్టుబాటవక పలువురు రైతులు విరమించారు. ఆ భూములను ఆక్వా చెరువులుగా మార్చారు. ప్రస్తుతం పీఎంలంక, చినమైనవానిలంక గ్రామాల పరిధిలో సుమారు మూడు వందల ఎకరాల్లో, రైతులు ఉప్పుసాగు చేస్తున్నారు.
ఎకరా భూమిని వంద మడులుగా చేసి చదును చేస్తారు. దీనికి రోజుకు ఐదుగురు కంటే ఎక్కువగా కూలీల అవసరం ఉంటుంది. అలా సుమారు 40 రోజులు మడులను సిద్ధం చేస్తారు. అనంతరం నేలబావి తవ్వి దానిలోని నీటిని ఆ మడుల్లో నింపుతారు. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు ఎంత ఎక్కువగా ఉంటే దిగుబడులు అధికంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మడులు సిద్ధం చేసేందుకే ఎకరాకు యాభై వేల రూపాయల పైబడి ఖర్చవతుందని రైతులు తెలిపారు.
ఈ ఏడాది సంభవించిన అకాల వర్షాలతో ఉప్పు సాగు మొత్తం దెబ్బతింది. మార్చి నెల ఆరంభం నుంచి ఉప్పు దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఆ నెల 15న సంధించిన వర్షంతో మడులు వాననీటితో మునిగాయి. రైతులు ఎంతో వ్యయప్రయాసలతో ఆ నీటిని బయటకు తోడి.. మడులను సిద్ధం చేశారు. ఈ వారంలోనే ఉప్పు దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో అకాల వర్షం ప్రతాపం చూపడంతో మడులు నీటమునిగి రైతుల ఆశలు గల్లంతయ్యాయి. దీంతో ఈ ఏడాది ఉప్పుసాగు చేయలేమని రైతులు చెబుతున్నారు.