గ్రీన్ జోన్లు గా ప్రకటించిన ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరవడానికి ప్రభుత్వం అనుమతించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అమ్మకాలు చేయవచ్చని సూచించింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో మొదటిరోజు ధరలు అప్డేట్ కాకపోవడం వల్ల అమ్మకాలు గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. అప్పటికే వందల సంఖ్యలో మందుబాబులు దుకాణాలకు చేరుకున్నారు.
మద్యం కోసం కిలోమీటర్ల దూరం నుంచి పయనం - drunkers cround in west godavari dst
కరోనా వైరస్ ప్రభావంతో సుదీర్ఘ విరామం తర్వాత గ్రీన్ జోన్లో మందు దుకాణాలను అనుమతించిన ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో మొదటి రోజు మందు బాబులను సంతృప్తి పరచలేక పోయింది. నిర్ణీత సమయానికి మందు అమ్మకాలు ప్రారంభం కాకపోగా, గడువు సమయానికి ముందే మందు సీసాలు అయిపోవటంతో దుకాణాలకు తాళాలు వేశారు. దీంతో మందు బాబులు ఉసూరుమంటూ వెనుతిరిగారు.
ఉండ్రాజవరం మండలం పక్కనే ఉన్న నిడదవోలు మండలం ఆరెంజ్ జోన్ లో ఉండగా చుట్టుపక్కల పది మండలాలు రెడ్ జోన్ లో ఉండడంతో ఆయా మండలాలకు చెందిన మందు బాబులు కూడా ఉండ్రాజవరం మండలం లోని దుకాణాలకు తరలిరావడంతో అనుమతించిన సమయం కంటే ముందే స్టాక్ అయిపోయింది. 20 నుంచి 25 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చిన మందు బాబులు సైతం ఉసూరుమంటూ వెనుతిరిగారు. అమ్మకాలు జరిగినంత సేపు కరోనా నిబంధనలు సైతం పక్కకు పోయాయి. నిబంధనలు పాటించేలా చేయడానికి నియమితులైన గ్రామ వాలంటీర్లు, పోలీస్ సిబ్బంది ఎంత మొత్తుకున్నా మందు బాబులు మాత్రం మా దారి మాది అన్నట్లు వ్యవహరించారు.