ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆగిన బతుకు బండి! కరోనాతో నిలిచిన ఆర్టీసీ అద్దె బస్సులు

కరోనా ప్రభావం ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన బస్సులు తిప్పే యజమానులపై తీవ్రంగా పడింది. అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసిన వారు నెలవారీ కిస్తీలు కట్టలేక, కుటుంబాలను పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే చోదకులు, వారి సహాయకులు పూట గడవక పస్తులుంటున్నారు. చేసేది లేక ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు.

rtc hires buses problems due to corona
కరోనాతో నిలిచిన ఆర్టీసీ అద్దె బస్సులు

By

Published : Oct 26, 2020, 2:54 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలోని 8 ఆర్టీసీ డిపోల పరిధిలో సుమారు 270 వరకు అద్దె బస్సులు నడుస్తున్నాయి. అప్పులు చేసి బస్సులు కొన్నవారు నెలకు రూ.55 వేల నుంచి రూ.60 వేల వరకు కిస్తీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులిచ్చిన వ్యాపారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. 8 నెలలుగా బస్సులు తిరగకపోవడంతో ప్రస్తుతం వాటిని రోడ్లపైకి తేవాలంటే మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. అసలే ఆదాయం లేని సమయంలో మళ్లీ పెట్టుబడి పెట్టడం తమకు ఇబ్బందికరమని అంటున్నారు. ‘నెలనెలా కిస్తీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. బస్సులు తిప్పేందుకు అనుమతివ్వాలి’ అని నిడదవోలుకు చెందిన యజమానులు కోరుతున్నారు.

యజమానుల బాధలు ఇలా ఉంటే డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. కొంతమంది ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కొని జీవనం సాగిస్తున్నారు. అదీ చేయలేని వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారు 540 మంది వరకు డ్రైవర్లు ఉన్నారు. క్లీనర్లు, ఇతర సిబ్బంది 1000 మంది వరకు ఉంటారు. వారందరికీ జీవనం కరవైంది. ‘ఇతర పనులకు వెళ్లలేక కుటుంబ పోషణ భారంగా మారింది. లారీలకు వెళ్దామన్నా అవీ షెడ్లకే పరిమితమయ్యాయని వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details