పోలవరం ప్రాజెక్టులో అతి కీలకమైన స్పిల్ వే గేట్ల అమరిక పూర్తి కావస్తోంది. అధిక శాతం పనులు తుది దశకు చేరుకున్నాయి. గేట్ల అమరిక, హైడ్రాలిక్ సిలిండర్లు, పవర్ ప్యాక్ ల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 44, 43 గేట్ల ట్రయల్ రన్ చేపట్టారు. ఈ రెండు గేట్లను హైడ్రాలిక్ సిలిండర్ల సాయంతో పైకి ఎత్తి, కిందకు దించి పరీక్షించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా గేట్లు పైకి, కిందకు కదిలాయి. హైడ్రాలిక్ సిలిండర్ల సాయంతో గేట్ల కదలిక చేపట్టిన దేశంలోనే తొలి ప్రాజెక్టుగా ప్రాజెక్టు రికార్డు సృష్టించింది. స్పిల్ వేకు మొత్తం 48గేట్లు అమర్చాల్సి ఉండగా.. 34 బిగించారు. మిగిలిన మరో 14 అమర్చాల్సి ఉంది. 48 గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చాల్సి ఉండగా.. 56 బిగింపు పూర్తైంది. 11 వందల 28 మీటర్ల మేర స్లాబ్ పనులు పూర్తి చేశారు.
హైడ్రాలిక్ సిలిండర్లే ప్రధానం....
స్పిల్‌వే గేట్ల అమరికలో ఈ హైడ్రాలిక్ సిలిండర్లే ప్రధానమైనవి. పవర్ ప్యాక్‌ల సాయంతో ఈ హైడ్రాలిక్ సిలిండర్లు పని చేస్తాయి. వీటి సాయంతో 300టన్నుల బరువు కలిగిన గేటు ఒక్కో నిమిషానికి 1.5మీటర్ల మేర పైకి లేపగలిగేందుకు వీలుంది. ఒక్కో గేటు ఎత్తేందుకు, దించేందుకు రెండు హైడ్రాలిక్ సిలిండర్లు అమరుస్తారు. ఒక్కో హైడ్రాలిక్ సిలిండర్ బరువు 20మెట్రిక్ టన్నులు, పొడవు 17.30మీటర్లు ఉంటుందని అధికారులు తెలిపారు. వీటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకొన్నారు. హైడ్రాలిక్ సిలిండర్ల అమరికలో జర్మనీకి చెందిన మౌంట్ అనే సంస్థ సాంకేతిక సాయం అందిస్తోంది. ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోనే ఉంటూ.. సిలిండర్ల బిగింపులో సాంకేతిక సాయం అందిస్తున్నారు. రెండు గేట్లకు ఒక్కో పవర్ ప్యాక్ ఏర్పాటు చేయాల్సి ఉంది. మొత్తం 24పవర్ ప్యాక్ లు అమర్చాల్సి ఉండగా.. 5పవర్ ప్యాక్‌ల పనులు పూర్తయ్యాయి. మిగితా పవర్ ప్యాక్ హౌస్‌ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి.
ఒక్కొగేటు బరువు 2 వేల 400 టన్నులు...