బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో వరద ఉధృతి కొనసాగింది. కైకరంలోని బీసీ, ఎస్సీ కాలనీలు, శివారు గ్రామాలైన బ్రహ్మానందపురం, లంకమాలపల్లి, వెంకటకృష్ణాపురం నీటమునిగాయి. నల్లపాడు గ్రామంలోని ఇరిగేషన్ చెరువులోకి రెండో రోజు వరద నీరు పోటెత్తింది. తాడిపూడి కాలువ ఉద్ధృతంగా ప్రవహించింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటితో వల్ల గొల్లగూడెం, తిమ్మయ్యపాలెం, గోపీనాథపట్నం, కంసాలిగుంట గ్రామాల్లో... వరి, పామాయిల్, మినప తోటలు నీటమునిగాయి. జిల్లా గుండా ప్రవహిస్తున్న ఏలూరు ప్రధాన కాలువ పోటెత్తింది. వెల్లమిల్లి, నాచుగుంట, నారాయణపురం తదితర ప్రాంతాల్లో ఓవర్ ఫ్లో కారణంగా గట్టుదాటి నీరు ప్రవేశించింది. 372 హెక్టార్లలో వరి పంట నేల వాలగా, మరో 157 హెక్టార్లలో వరి నీట మునిగింది. గణపవరం మండలంలోని పిప్పరలోని ఎస్సీ కాలనీ జలమయమైంది. యదనమర్రు కాలువకు వరద భారీగా చేరింది.
ప్రమాదకరంగా మొండికోడు డ్రైన్
దెందులూరు మండలం కొవ్వలిలో మొండికోడు డ్రైన్ లో వరద నీటి ప్రవాహం ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. పలుచోట్ల పొలాలను ముంచెత్తింది . తాసు పాము శిల వద్ద డ్రైన్ గట్ల ఇరువైపులా కోతకు గురికావడంతో అంతా ఆందోళన చెందుతున్నారు . పటిష్ట పరచడానికి రైతులు చర్యలు చేపట్టారు . కుడివైపు చేపల చెరువు గట్టు వద్ద నీటి ప్రవాహానికి కోతకు గురవుతోంది . నీటి ప్రవాహం పెరగడంతో తో గ్రామస్తులులో ఆందోళన నెలకొంది.