పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం పరిధిలో తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ ముగిసేదాకా తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. తనపై మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రఘురామకృష్ణరాజు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఎంపీపై ఫిర్యాదులు ఇవే...
- తన పరువుకు భంగం కలిగించాడని ఎంపీపై రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం పోడూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు
- తన సహచర వైకాపా ఎమ్యెల్యేలను కించపరిచే విధంగా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు చేశారని.. చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎమ్యెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
- నరసాపురం శాసన సభ్యుడు ముదునూరి ప్రసాద్ రాజు సైతం ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- ఎంపీపై ఎమ్మెల్యే వెంకటనాగేశ్వరరావు వ్యక్తిగత కార్యదర్శి తణుకు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఎంపీ మాట్లాడారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.