పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఇళ్ల స్థలాలు కేటాయింపునకు లబ్ధిదారులను ఫొటోలు దిగడానికి రావాలని పిలవడంతో పట్టణంలోని రెడ్ జోన్లలో ఉన్న లబ్ధిదారులతో సహా... పట్టణంలోని 4635 లబ్ధిదారులు ఒక్క చోటే చేరారు. తమ భర్తలతో సహా కేటాయించిన స్థలం వద్దకు చేరడంతో అక్కడ జాతర వాతావరణం నెలకొంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఒక్కరు కూడా భౌతికదూరం పాటించలేదు. తోసుకుంటూ క్యూ లైన్లలో నిలబడ్డారు.
ఇంత జరుగుతున్నా అక్కడ జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులుగాని, అధికారులుగాని లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అధికారులకు మీడియా సభ్యులు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకుని లబ్ధిదారులను చెదరగొట్టారు.
నరసాపురం పట్టణంలో 4635 లబ్ధిదారులకుగాను 84 ఎకరాలు స్థలాన్నిప్రభుత్వం కేటాయించింది. జులై 8న ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ముహూర్తం ఖరారు చేసింది. అందరు లబ్ధిదారులను ఒకేసారి ఫొటోలు దిగేందుకు స్థలం వద్దకు రావాలని వాలంటీర్లు ఫోన్ చేశారు. రాకపోతే స్థలం పట్టా రాదని చెప్పగా లబ్ధిదారులు కరోనాను సైతం లెక్కచేయకుండా అక్కడకు చేరుకున్నారు.
నియోజకవర్గంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందని లాక్ డౌన్ ప్రకటిస్తే.. అధికారుల నిర్లక్ష్యంతో మరింత వ్యాప్తి చెందే విధంగా ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. పట్టణంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందేందుకు అధికారులే కారణమని తమకు కరోనా వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. తాము చెప్పలేదని వాలంటీర్ల తప్పిదం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
ఇది చదవండిఉద్యోగం నుంచి తొలిగించారనే మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య