ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

padayatra: అడుగడుగునా అడ్డంకులు.. అయినా ముందుకు సాగుతున్న రైతుల పాదయాత్ర - padayatra

Amaravati: ఆంధ్రుల భవిష్యత్తును నిర్దేశించే అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ.. రైతులు చేస్తున్న పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో సమరోత్సాహంతో సాగుతోంది. ఐతంపూడి వద్ద వైకాపా శ్రేణుల నిరసనలు, జోరువానను సైతం లెక్కచేయక కదం తొక్కిన రైతన్నలకు.. స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతిమ విజయం అన్నదాతలదేనని భరోసా ఇస్తూ.. జైఅమరావతి నినాదాలతో హోరెత్తించారు.

Padayathra in West Godavari
రైతుల పాదయాత్రలో వైకాపా శ్రేణుల నిరసనలు

By

Published : Oct 12, 2022, 2:00 PM IST

padayatra in West Godavari: అడుగడుగునా అధికార పార్టీ నేతల అవహేళనలు, అడ్డంకుల్ని దాటుకుంటూ... రాజధాని రైతులు చెదరని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని అని నినదిస్తూ.... పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ నుంచి 30వ రోజు యాత్ర కొనసాగించారు. భూములు త్యాగం చేసిన అన్నదాతలకు... పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అపూర్వ స్వాగతం లభించింది. వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, రైతు సంఘాల నాయకులు పెద్దఎత్తున వచ్చి సంఘీభావం తెలిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. వానలో తడుస్తూనే రైతులతో కలిసి అడుగులేశారు.

రైతుల పాదయాత్రలో వైకాపా శ్రేణుల నిరసనలు

అమరాతిని వ్యతిరేకిస్తూ, మూడు రాజధానులను సమర్థిస్తూ... ఐతంపూడిలో వైకాపా నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. పాదయాత్ర కొనసాగిన వేల్పూరు వరకు రైతులను, మహిళలను అవమానిస్తూ రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు కట్టారు. ఐతంపూడి సుబ్రమణ్యేశ్వర స్వామి దేవస్థానం దాటగానే.. మూడు రాజధానులు ముద్దు, అమరావతి వద్దు అంటూ వైకాపా కార్యకర్తలు ప్లకార్డులు, నల్ల బెలూన్లు, కండువాలు చూపిస్తూ రెచ్చగొట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తగా, వైకాపా శ్రేణులను పోలీసులు నిలువరించారు. జైఅమరావతి నినాదాలు చేస్తూ రాజధాని రైతులు ముందుకు సాగారు.

పాదయాత్ర గొల్లగుంటపాలెం చేరుకునే సరికి భారీ వర్షం కురిసింది. అయినా లెక్కచేయకుండా... జోరు వానలోనే రైతులు యాత్ర సాగించారు. హైకోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తున్న తమకు సరైన రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. వైకాపా నాయకులు కవ్విస్తుంటే చోద్యం చూస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. వైకాపా వర్గీయులను ఉసిగొల్పేలా ప్రవర్తించిన తణకు రూరల్ ఎస్ఐ ఆంజనేయులుపై ప్రైవేటు కేసు వేస్తామని చెప్పారు.

ఈ రోజు ఉదయం అమరావతి రైతుల పాదయాత్ర ప్రాంభమైంది. వేల్పూరు వద్ద స్థానికులు.. రైతులకు వినూత్న స్వాగతం తెలిపారు. పూలు, మొక్కలతో వినాయకుడు, శివలింగాల ఆకారంలో ప్రదర్శన చేపట్టారు. జై అమరావతి అని అలంకరించి రైతులకు ఆహ్వానం పలికారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details