సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులతో ప్రధానంగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో పరిస్థితులు చిన్నచిన్న కారణాలతో పగ, ప్రతీకారాలు చెలరేగేలా చేస్తుంటాయి. అందుకే పోలీసులు ఆయా గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ గ్రామాలపై ఎప్పటికప్పుడు డేగకన్ను వేసి ఉంచుతున్నారు.
అంతా నాఇష్టం.. అంటే మీకే నష్టం!
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి పౌరుడు అందుకు అనుగుణంగా నడుచుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా, ఇతరులను అవమానపరిచేలా పోస్టింగ్‌లు పెడితే చట్టపరమైన చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే పోలీసు అధికారులు పలు హెచ్చరికలు జారీచేశారు.
problems to social media groups admins about Unnecessary posts
పశ్చిమ గోదావరి జిల్లాలో సమస్యాత్మక గ్రామాలు 360 ఉండగా, అత్యంత సమస్యాత్మక గ్రామాలు 246 ఉన్నట్లు పోలీసు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల పరిధిలోని బైండోవర్ వ్యక్తులు, రౌడీషీటర్లు, సామాజిక మాధ్యమాల ద్వారా వివాదాస్పద పోస్టింగ్‌లు పెట్టే వారిపై నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
- సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి రాజకీయ సందేశానికి అడ్మిన్‌దే పూర్తి బాధ్యత. ఎవరైనా సభ్యులు అభ్యంతరకర పోస్టులు పెడితే వారిని వెంటనే ఆ గ్రూపు నుంచి తొలగించడం శ్రేయస్కరం.
- వ్యక్తిగత దూషణలు చేయకూడదు.
- ఓటర్లను ప్రలోభపెట్టేలా పోస్టులు పెట్టకూడదు.
- అడ్మిన్‌తో పాటు గ్రూపు సభ్యులు ఎవరైనా సరే వివాదాస్పద పోస్టులు పెడితే కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది.
- సామాజిక వర్గాలు, మతాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడంపై ఇప్పటికే పోలీసు శాఖ నిషేధం విధించింది.
- మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- సామాజిక వర్గాల మధ్య వివాదాలు రేపే ఏ అంశంపై అయినా సరే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
- తెలియని అంశాలను షేర్ చేయకూడదు.