పశ్చిమ గోదావరి జిల్లాలోని పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికి వచ్చిన పంట విక్రయించుకునే పరిస్థితి లేక రైతులు విలవిలలాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 14 వేల మంది రైతులు 22వేల హెక్టార్లలో పొగాకును ఏటా సాగు చేస్తున్నారు. నాలుగేళ్లుగా సాగులో వరుస నష్టాలు చూస్తున్నా... నెట్టుకొస్తున్నారు. గత నెల మార్చి 21న పొగాకు కొనుగోళ్లను లాంఛనంగా ప్రారంభించినా...23నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన కారణంగా.. ప్రక్రియ నిలిచిపోయింది.
పొగాకు సాగుకు బ్యాంకుల నుంచి రుణం పొందిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పంట ఇంటికే పరిమితం అవుతున్న పరిస్థితుల్లో... ప్రస్తుతం బ్యాంకుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. జిల్లాలో జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో పొగాకు వేలం కేంద్రాలున్నాయి. కేవలం ప్రారంభం రోజునే కొనుగోళ్లు జరిగాయి. నాటి నుంచి నేటి వరకు ఎటువంటి క్రయవిక్రయాలు లేవు. ఇతర జిల్లాల నుంచి తీసుకువచ్చిన కూలీలు సైతం పంపడానికి వీలులేకుండా తమ వద్ద ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ తో తాము ఎటూ కదలలేని పరిస్థితి నెలకొందని ఇతర ప్రాంతాల నుంచి పొగాకు పనికి వచ్చిన కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.