ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నానాటికీ నమ్మకం తగ్గిపోతోంది. అప్పు చేసి అయినా కార్పొరేట్ విద్యను ఆశ్రయిస్తున్నారు కానీ... ప్రభుత్వ పాఠశాలల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీనిని అదునుగా చేసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. జీవోనెంబర్-1, ఫీజుల రెగ్యులెటరీ కమిటీ, తిరుమలరావు కమిషన్ వంటి వాటిని ఆదేశాలను పక్కనపెట్టి.. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజులు పెంచుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చదువు'కొనా'లంటే... ఆస్తులు అమ్ముకోవాల్సిందే! - no rules
ప్రభుత్వ పాఠశాలలపై అపనమ్మకం, తమ పిల్లల్ని బాగా చదవించాలనే కోరికతో ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను అమాంతం ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. నిబంధనలు తుంగలో తోసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
ఎల్కేజీకే వేలల్లో ఫీజులు
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి ఏడాది 5 శాతం మేర ప్రైవేటు పాఠశాలల సంఖ్య పెరుగుతుండగా.. 10కి పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు బడివైపు పంపుతుండటం వల్లే.. ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఇదే అదనుగా ప్రైవేటు పాఠశాలలు ఫీజులు పెంచుతున్నాయి. ఎల్ కేజీ, యూకేజీ స్థాయిలోనే 25 వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 35 నుంచి 50వేలు, ఆరోతరగతి నుంచి పదో తరగతి వారి నుంచి లక్షరూపాయల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. పుస్తకాలు, దుస్తులు, బూట్లు, ఇతర ఖర్చులంటూ మరో ఐదు వేల నుంచి పదివేల రూపాయలు దండుకొంటున్నాయి. వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో ఉంచాలి. కానీ ఈ నిబంధనలు మాత్రం అమలు కావడం లేదు. ప్రభుత్వానికి ఇస్తున్న ఫీజుల వివరాల రికార్డులు వేరుగా ఉంటున్నాయి. సాధారణ ఫీజుల వసూళ్లకు మరో రికార్డు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై ప్రభుత్వ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విద్యార్థులు తల్లితండ్రులు కోరుతున్నారు.