ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అల్లూరి 125వ జయంతి వేడుకలు.. మురిసిపోతున్న విప్లవవీరుడు నడయాడిన నేల - భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహం

Alluri Bronze Statue: బడిలో పాఠాలు నేర్చుకునే సమయం నుంచే స్వతంత్ర పోరాట భావాలు... యువకునిగానే బ్రిటిషర్లపై పోరు... దేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించాలనే దృఢ సంకల్పం.. ఇలా భారత స్వాతంత్య్ర సమరంలో అల్లూరి సీతారామరాజుది ప్రత్యేక ఒరవడి. 27 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు. అల్లూరి 125వ జయంతి వేడుకల సందర్భంగా ఆ మహనీయుడిని పుట్టిన గడ్డ స్మరించుకుంటోంది. జయంతి ఉత్సవాలకు సీతారామరాజు స్వగ్రామం మోగల్లు ముస్తాబైంది.

Alluri Sitaramaraju
Alluri Sitaramaraju

By

Published : Jul 3, 2022, 5:16 AM IST

Updated : Jul 3, 2022, 10:20 AM IST

అల్లూరి 125వ జయంతి వేడుకలు.. మురిసిపోతున్న విప్లవవీరుడు నడయాడిన నేల

Alluri Seetharama Raju: విశాఖ జిల్లా పాండ్రంగిలో సూర్యనారాయణమ్మ, వెంకటరామరాజు దంపతులకు 1897 జూలై 4న అల్లూరి సీతారామరాజు జన్మించారు. ఆయన చిన్నతనంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొన్నాళ్లు నివసించారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. కొవ్వాడ, వెంప గ్రామాలతో పాటు పాలకోడేరు మండలం మోగల్లు, నరసాపురాల్లో కొంతకాలం ఉన్నారు. అల్లూరిని బాల్యంలో ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. అల్లూరిలో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపింది తల్లిదండ్రులే. బ్రిటీష్‌ వారి అకృత్యాలు చూడలేక... స్వాతంత్య్ర సంగ్రామాన్ని విప్లవ పంథాలో ముందుకు తీసుకెళ్లారు సీతారామరాజు. గెరిల్లా తరహా దాడులతో బ్రిటిష్‌ సైన్యాన్ని గడగడలాడించి.. సమర స్ఫూర్తిని నింపారు. దేశం కోసం బ్రిటిష్‌వారిని ఎదురించి.. 1924లో కేవలం 27 ఏళ్ల వయస్సులోనే ప్రాణాలు అర్పించారు. అల్లూరి 125వ జయంతి వేళ.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా అల్లూడి నడయాడిన మోగల్లు గ్రామస్థులు ఆయన త్యాగాన్ని, పోరాటాలను మననం చేసుకుంటున్నారు.

Mogallu: దేశంలోని మొట్ట మొదటి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని 1965లో మోగల్లు పంచాయతీ చెరువుగట్టున ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని అల్లూరి ముఖ్య అనుచరుడు, అప్పటి పార్లమెంట్‌ సభ్యుడు మల్లు దొర పర్యవేక్షణలో తయారు చేయించారు. 1986లో జలగం వెంగళరావు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అల్లూరి స్మారక తపాల బిల్లు విడుదల చేశారు. అల్లూరి నివసించినచోట స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నించినా.. ఆ దిశగా అడుగులు పడలేదు. దీంతో స్థానికులే చొరవ తీసుకుని అల్లూరి ధ్యాన మందిరం నిర్మాణం మొదలు పెట్టారు. అల్లూరి 125 వ జయంతి కార్యక్రమానికి ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్న వేళ... నిర్మాణ పనులు జోరుందుకున్నాయి. ప్రధాని రాక పట్ల మోగల్లు గ్రామస్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మోగల్లు వాసుల సంబరాలు:అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్బంగా.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా భీమవరంలో ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భీమవరం సమీపంలో అల్లూరి కుటుంబ సభ్యులు నివసించిన మోగల్లు వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతోపాటు ఆయన జీవిత విశేషాలను తెలియజెప్పే స్మారక నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు.

స్వగ్రామంలో జ్ఞానమందిరం:మోగల్లులో సీతారామరాజు కుటుంబం నివసించిన ప్రాంతంలో అల్లూరి పేరిట జ్ఞాన మందిరం నిర్మాణాన్ని ఇటీవల చేపట్టారు. దీన్ని 100 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అల్లూరి సీతారామరాజు స్మారక సంస్థ అధ్యక్షుడు దండు శ్రీనివాసరాజు తెలిపారు. పార్టీలకు అతీతంగా అల్లూరి స్మారక నిర్మాణాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

మ్యూజియం ఏర్పాటు చేయాలి:అల్లూరి సీతారామరాజు కుటుంబం నివసించిన ప్రాంతంలో నేను 8 ఏళ్లుగా సేవ చేస్తున్నా. ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతా. ఈ స్థలం చుట్టూ కంచె ఏర్పాటుచేసి మొక్కలు పెంపకం చేపట్టా. ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా. - కొత్తపల్లి సీతారామరాజు, మోగల్లు

అదే ప్రజల ఆకాంక్ష:మోగల్లులో అల్లూరి పేరిట నిర్మాణాలు చేపడతామని నాయకులు చెప్పడమే తప్ప ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు అల్లూరి ఘనతను చాటే నిర్మాణాలు చేపట్టాలన్నదే మోగల్లు ప్రజల ఆకాంక్ష. - కె.భీమరాజు, మోగల్లు

ఇదీ చదవండి:

Last Updated : Jul 3, 2022, 10:20 AM IST

ABOUT THE AUTHOR

...view details