ట్రేలలో కోడి గుడ్లు
పశ్చిమగోదావరి జిల్లాలో 1.30 కోట్లు కోళ్ల పెంపకానికి సరిపడా మౌలిక వసతులతో కూడిన షెడ్లున్నాయి. అయితే మేత ధరల అనూహ్యంగా పెరగడం, గుడ్డు గిట్టుబాటు ధర కంటే తక్కువకే విక్రయించాల్సి రావడంతో నష్టాలను భరించలేక చాలామంది రైతులు కోళ్ల పెంపకానికి దూరమయ్యారు. రెండు లక్షల సామర్థ్యంతో కోళ్లు పెంచే రైతులు సుమారు రూ.5కోట్లు మేర నష్టాలను చవిచూడాల్సి వచ్చిందంటే కోళ్ల పరిశ్రమ దెబ్బతిన్న తీరు అర్థమవుతోంది. ప్రస్తుతం జిల్లాలో 80 లక్షల కోళ్లు ఉన్నాయి. వీటి నుంచి నిత్యం 80 శాతం మేర గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 70 శాతం వరకు ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. కొవిడ్ ప్రబలుతున్న తరుణంలో షోషకాహారంగా గుడ్డు తినాలన్న వైద్యుల సూచనలతో స్థానిక వినియోగం కూడా ఒక్కసారిగా పెరిగింది. అంతేగాక పాఠశాలలకు సెలవులైనప్పటికీ మధ్యాహ్న భోజన పథకంలో అందించే గుడ్డును విద్యార్థులకు అందించడం వంటి అంశాలు కోళ్ల పెంపకానికి ఊరటనిస్తున్నాయి. దీంతో గుడ్డు ధర అనూహ్యంగా పెరగడానికి కారణంగా ఉంది. కోడి పిల్లలు(చిక్) సరఫరా చేసే హేచరీలు కొవిడ్ దెబ్బకు 40నుంచి 50శాతం మేర ఉత్పత్తిని తగ్గించాయి. ప్రస్తుతం సరఫరా అంతంతమాత్రంగా ఉంది. అంతేగాక కోళ్ల మేతలో అధికంగా వినియోగించే మొక్కజొన్న టన్ను ధర రూ. 22వేల నుంచి రూ.15,000లకు దిగిరావడంతో మేతకు వెచ్చించే వ్యయాల్లో వెసులుబాటు కలిగింది.