పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగంగా నాలుగు దశాబ్దాల కిందట ప్రారంభమైన పౌల్ట్రీ పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగి రైతులు ఈ పరిశ్రమలో స్థిరపడేలా చేసింది. వేల సంఖ్యలో కోళ్లతో ప్రారంభమైన పౌల్ట్రీ పరిశ్రమ.. కోటి 30 లక్షల కోళ్ల స్థాయికి ఎదిగింది. గత సంవత్సరం మార్చి నెలలో పరిశ్రమలో వ్యాపించిన వైరస్ ఈ పరిస్థితిని మార్చేసింది. వైరస్ కారణంగా కోడిగుడ్డు, చికెన్ తినకూడదని వదంతుల వల్ల గుడ్డు ధర పడిపోయింది. దీనికి తోడు ముడిసరుకుల ధరలు పెరగకపోయినా.. లాక్‌డౌన్ కారణంతో రవాణా చార్జీలు పెంచడంతో రైతులు ఇబ్బందులు పాలయ్యారు.
కరోనా ప్రభావంతో కోడిగుడ్లు మారుమూల ప్రాంతాలకు చేరకపోవడం, గుడ్డు రేటు తగ్గిపోవడం మరో కారణం అయింది. పౌల్ట్రీ పరిశ్రమల్లో ఉపయోగించే అన్ని రకాల ముడి సరుకులకు ప్రభుత్వ మద్దతు ధరలు ఉన్నా.. పౌల్ట్రీ ఉత్పత్తులకు మాత్రం మద్దతు ధర లేదని రైతులు అంటున్నారు. కోడిగుడ్డుకు ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం మూడు రూపాయలు 70 పైసలు పైన మద్దతు ధర ఉంటేనే గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు.