పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన ఉండ్రాజవరం గ్రామానికి ప్రత్యేకత ఉంది. ఆర్థికంగా సుసంపన్నమైన గ్రామాల్లో ఒకటిగా జాతీయస్థాయి గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు అనుబంధంగా పాడి పశువులను పెంచేవారు. సుమారు అర్ధ శతాబ్దం క్రితం దేశంలో పౌల్ట్రీ వ్యవస్థ ప్రారంభమైన తొలినాళ్లలోనే వ్యవసాయ అనుబంధంగా ఈ గ్రామ రైతులు పౌల్ట్రీ ఫారాల ఏర్పాటు చేపట్టారు. తొలినాళ్లలో వందల సంఖ్యలో కోళ్లతో ప్రారంభమైన ఫారాలు లక్షల సంఖ్యకు చేరాయి.
జిల్లా వ్యాప్తంగా కోటి యాభై లక్షల కోళ్లు ఉండగా సుమారు 20 నుంచి 25 శాతం కోళ్లు ఈ గ్రామానికి చెందిన రైతులకు చెందినవే. ఉండ్రాజవరంలోనే కాక జిల్లాలోని లక్ష్మీపురం తదితర చోట్ల తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండతోపాటు పలు ప్రాంతాల్లో ఈ గ్రామ రైతులు ఫారాలు ఏర్పాటు చేశారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమ కావడం వల్ల లాభదాయకంగా ఉంటుందని పౌల్ట్రీలను ఏర్పాటు చేసినట్లు రైతులు చెబుతారు.