సంక్రాంతి వచ్చిందంటే పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందేల సందడి నెలకొంటుంది. గ్రామశివార్లలో కోడిపందేల బరులు జనంతో కిక్కిరిసిపోతాయి. ఈ సమయంలో కోట్లాది రూపాయల జూదాలు సాగుతాయి. జిల్లాలో ఏలూరు, గుండగొలను, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, ఆకివీడు, ఉండి, ప్రాంతాల్లో కోట్లాది రూపాయల పందేలు కాస్తారు. ఈసారి కూడా బరులు సిద్ధం చేస్తున్నారు కోడి పందేల నిర్వాహకులు. వీటిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
కత్తులు కట్టి కోడిపందేలు నిర్వహించరాదని మూడేళ్ల కిందట రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత మూడేళ్లుగా న్యాయస్థానం ఆదేశాల అమలుకు పోలీసులు ప్రయత్నాలు సాగించినా... అడ్డుకోలేకపోతున్నారు. తూతూమంత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ సారి మాత్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నెలరోజుల ముందు నుంచే గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. జూదాలకు ప్రత్యమ్నాయంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. కోడి పందేల బరులు ఏర్పాటు చేసే ప్రధాన నిర్వాహకులను బైండోవర్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 4300మందిని బైండోవర్ చేశారు. పదివేల కోడికత్తులు స్వాధీనం చేసుకొన్నారు. పందేలా నిర్వహణకు ఏర్పాటు చేసిన పది బరులు సైతం ధ్వంసం చేశారు. మరోవైపు జిల్లాలో ఆదాయపన్నుశాఖకు సంబంధించిన బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి.