అధిక నీటిని ఒడిసిపట్టేలా.. పోలవరం ప్రాజెక్టు వద్ద కుడి వైపున నిర్మాణంలో ఉన్న రెండు టన్నెళ్ల సామర్థ్యం పెంచి, రెట్టింపు నీళ్లు మళ్లించేలా జలవనరులశాఖ తయారు చేసిన ప్రతిపాదనలు... ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. కుడివైపు అనుసంధాన పనుల్లో భాగంగా ఇంకా 2 టన్నెళ్ల పనులు జరుగుతున్నాయి. వీటి సామర్థ్యం పెంపు విషయంలో ప్రభుత్వ నిర్ణయం వెలువడితే అదనపు పనులు కలిపి.... రెండు టన్నెళ్ల నిర్మాణమూ పూర్తి చేయాలనే యోచనలో జలవనరులశాఖ ఉంది.
ఆర్థికశాఖ పరిశీలన అనంతరం ఈ పనులు చేపట్టేందుకు పాలనామోద ఉత్తర్వులు రానున్నాయి. ప్రభుత్వంలో ఉన్నతస్థాయి సూచన మేరకే పోలవరం ప్రాజెక్టులో రెండు టన్నెళ్ల సామర్థ్యం పెంచాలని జలవనరులశాఖ ప్రతిపాదించింది. గోదావరి వరద సమయంలో అదనంగా నీళ్లు తీసుకునేందుకు వీలుగా ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారు. ప్రస్తుతమున్న పోలవరం కుడి కాలువను మరింత వెడల్పు చేసుకుంటే ప్రకాశం బ్యారేజి వరకు గ్రావిటీ ద్వారా.... తక్కువ ఖర్చుతోనే నీరు తరలించవచ్చనే ఆలోచనలో భాగంగానే ఇది రూపుదిద్దుకుంటోంది.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్ద ఈ అంశంపై గతంలోనే ప్రాథమికంగా చర్చ జరిగిందని సమాచారం. టన్నెళ్ల సామర్థ్యం పెంపునకు ఎలాంటి అవకాశం లేదని అథారిటీ చైర్మన్ అభిప్రాయపడినట్లు తెలిసింది. పోలవరం డీపీఆర్‌లో ఈ విషయం లేదని, పూర్తి ప్రాజెక్టు నివేదికలో లేని అంశంపై ఇప్పుడు ఎలా స్పందిస్తామని ప్రశ్నించినట్లు సమాచారం. గోదావరి నదిపై అత్యంత దిగువన నిర్మిస్తున్న ప్రాజెక్టు పోలవరం. ఆ తర్వాత ఎక్కడా నీటిని నిల్వ చేసుకునే ఆస్కారం లేదు. అందువల్ల పోలవరం వద్ద అవకాశం ఉన్న మేర నీటిని వినియోగించుకునేందుకు ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చామనేది రాష్ట్ర జలవనరుల శాఖ వాదన.
ఈ విషయంలో పోలవరం అథారిటీకి ఎలాంటి పాత్ర లేదని అధికారులు చెబుతున్నారు. 11.8 మీటర్ల వ్యాసంతో రెండు టన్నెళ్ల నిర్మాణమూ పూర్తయింది. అటవీ భూమి అదనంగా తీసుకోవాల్సిన అవసరం లేకుండానే... ప్రస్తుత టన్నెళ్ల సామర్థ్యం పెంచేందుకు బెనారస్ ఐఐటీ నిపుణులు డిజైన్లు రూపొందించినట్లు సమాచారం. ఈ టన్నెళ్ల వ్యాసం 17.8 మీటర్లకు పెంచనున్నారు. ఈ డిజైన్లను రాష్ట్రంలోని కేంద్ర ఆకృతుల సంస్థ చీఫ్ ఇంజినీరు ఆమోదించి పంపారు. ఈ ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ ముందుంచి చర్చించారు. వారి సిఫార్సులను కూడా జత చేసి ప్రభుత్వానికి పంపారు. జలవనరుల శాఖ పరిశీలన పూర్తిచేయగా.... ఆర్థికశాఖ వద్ద పరిశీలనలో ఉంది.
ఇదీ చదవండీ... నేడే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల పోలింగ్