పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అంచనాల పెంపుపై కేంద్ర జల వనరులశాఖ సందేహాలకు ఆంధ్రప్రదేశ్ అధికారులు సవివర సమాధానాలిచ్చారు. 2017-18లో సవరించిన అంచనాల్లో సాంకేతిక సలహా కమిటీ ఆమోదం మేరకు రూ.55,656 కోట్లకు పెట్టుబడి అనుమతిచ్చి, కేంద్ర మంత్రిమండలి ఆమోదానికి పంపాలని వారు కోరారు. దిల్లీలో ఇటీవల జరిగిన సమావేశం తర్వాత పోలవరం తాజా అంచనాలపై కేంద్ర జల వనరులశాఖ అధికారులు దృష్టి పెట్టారు. 2010-11 అంచనాల నుంచి 2017-18 అంచనాల వరకు పెద్ద మొత్తంలో మార్పు ఎందుకు వచ్చిందని కేంద్ర అధికారులు అడిగారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్, కమిషనరు గోయెల్‌తో చర్చించారు.
పోలవరం అంచనాలపై కొత్త పత్రాలు..
పొలవరం అంచనాలపై రాష్ట్ర అధికారులు కొత్త పత్రాలు తయారు చేశారు. నేడు రాష్ట్ర జల వనరులశాఖ అధికారులు కేంద్రానికి పత్రాలు సమర్పించనున్నారు.
పోలవరం ప్రాజెక్టులో 2004-05 నుంచి 2010-11కు, ఆ తర్వాత 2015-16కు, ఇప్పుడు 2017-18 అంచనాలకు మధ్య పెద్ద స్థాయిలో వ్యత్యాసం ఎందుకు వచ్చిందో వారు వివరాలు కోరారు. పనికి సంబంధించిన పరిమాణాలు భారీగా ఎందుకు పెరిగాయో ఆరా తీశారు. ప్రాజెక్టు డిజైన్లకు ఆమోదం ఎవరు తెలియజేస్తున్నారు? వారి ఆమోద వివరాలు.. ఆ మేరకు పని పరిమాణం పెరిగిన అంశాలపై వారి అనుమానాలను ఆదిత్యనాథ్ దాస్ నివృత్తి చేశారు. 2013 భూసేకరణ చట్టం కారణంగా భూసేకరణ, పునరావాసం అంచనాలు ఎలా పెరిగాయో వివరించారు. ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలు అవసరమని కేంద్ర అధికారులు కోరారు. దీంతో ఆయా పత్రాలను తీసుకుని జల వనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు, పోలవరం చీఫ్ ఇంజినీరు సుధాకర్‌బాబు తదితరులు దిల్లీ వెళ్లారు. కేంద్ర అధికారులకు బుధవారమే వాటిని అందజేయనున్నారు. పెట్టుబడి అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర అధికారులు సుముఖంగానే ఉన్నారని రాష్ట్ర యంత్రాంగం పేర్కొంటోంది.
ఇదీ చదవండి: