పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ నిర్మాణంతో ముంపు గ్రామాలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. గోదావరికి చిన్న వరద వస్తేనే అక్కడి గ్రామాలు ముంపునకు గురవుతాయి. బతుకుజీవుడా అంటూ.. ఏటా నిర్వాసితులు గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. ఈ ఏడాది బలవంతంగా ముంపు గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. గ్రామాలు ఖాళీ చేసిన నిర్వాసితులు సరైన నివాసాలు లేక పడుతున్న పాట్లు వర్ణణాతీతం. తాత్కాలికంగా పాకలు వేసుకొని బిక్కుబిక్కుమంటు కాలం గడుపుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ముంపు గ్రామాల ప్రజలను అధికారులు అసంపూర్తిగా ఉన్న పునరావాస కాలనీలకు తరలించారు. పునరావాస కాలనీలు పూర్తై ఉంటే.. నిర్వాసితులకు ఈ పరిస్థితి ఉండేదికాదు.
వసతులు కల్పించకుండా నిర్వాసితులపై ఒత్తిడి..
పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 25 పునరావాస కాలనీల నిర్మాణం నాలుగేళ్ల కిందట ప్రారంభమైంది. రెండున్నరేళ్లుగా కాలనీల నిర్మాణం ఆగిపోయింది. ప్రభుత్వం మారడం వల్ల.. గుత్తేదారులు అర్ధాంతరంగా కాలనీల నిర్మాణం నిలిపేశారు. ప్రస్తుత ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టకుండా కాలయాపన చేసింది. కాలనీల్లో వేలాది ఇళ్లు అసంపూర్తిగానే ఉన్నాయి. పూర్తైన కాలనీల్లో మౌళిక వసతులలేమి వెంటాడుతోంది. ప్రాజెక్టు 41 కాంటూరు పరిధిలో 25 ప్రధాన ముంపు గ్రామాలను గుర్తించారు. ఈ గ్రామాల నిర్వాసితులను పునరావాస కాలనీలకు బలవంతంగా పంపారు. కాలనీల్లో సరైన సౌకర్యాలు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్, ప్లాస్టింగ్ లేని ఇళ్లలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు, విద్యుత్, రహదారులు వంటి సౌకర్యాలు కాలనీల్లో కనిపించడం లేదు. 25 ముంపు గ్రామాలను ఖాళీ చేయమని నిర్వాసితులపై ఒత్తిడి పెంచుతున్న అధికారులు వారికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలేదని నిర్వాసితులు వాపోతున్నారు.
''పునరావాస కాలనీలో కరెంట్ లేదు. మనిషికి 5 కేజీల బియ్యం ఇచ్చారు. మంచినీటి సౌకర్యం లేదు. కాలనీలో కొంత భాగానికే కరెంట్ కనెక్టన్లు ఇచ్చారు. ఇళ్లకు డోర్లు లేకపోవడంతో పాములు వస్తున్నాయి. అధికారులెవరూ అసలు పట్టించుకోవడం లేదు. సమస్యలు కనుక్కునేందుకు సైతం అధికారులు రావడంలేదు.'' - సుమలత, నిర్వాసితురాలు, వేలేరుపాడు
''వీధి దీపాలు లేవు. చీకటి పడ్డాక బయటకు రావాలంటే భయమేస్తోంది. గతంలో మనుషులు నివసించిన ప్రాంతం కాదిది. పాములు, తేళ్ల సంచారం ఆందోళన కలిగిస్తోంది. మౌళిక సదుపాయాలపై అధికారులను అడిగినా పట్టించుకోవడంలేదు. వర్షం వస్తే నీరు ఇంటిలోకి చేరుకుని ఇబ్బంది పడుతున్నాం.'' - నరసింహ, నిర్వాసితుడు, వేలేరుపాడు
పునరావాసంపై శ్రద్ధచూపని ప్రభుత్వం..