ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మళ్లీ కేంద్ర జలసంఘం పరిశీలనకు పోలవరం ఖర్చు - పోలవరం తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టు విషయంలో...... కేంద్రరాష్ట్రాల మధ్య అనిశ్చితి కొనసాగుతోంది. తాగు, పారిశ్రామిక అవసరాల నీటి సరఫరా ఖర్చును 7 వేల 214 కోట్లుగా చూపించగా.... ఈ మొత్తాన్ని పరిశీలించాలని జలశక్తి శాఖ కేంద్ర జలసంఘాన్ని కోరింది. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయంపై తాగునీటి ఖర్చు 10 శాతం కన్నా ఎక్కువగా ఉన్నందువల్లే... మళ్లీ పరిశీలనకు పంపి ఉండొచ్చని అధికారులు అంటున్నారు.

Polavaram
Polavaram

By

Published : Dec 1, 2020, 6:00 AM IST

పోలవరం ప్రాజెక్టు అంచనాలో పేర్కొన్న తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా ఖర్చును పరిశీలించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కేంద్ర జల సంఘాన్ని కోరినట్లు తెలిసింది. ఈ రెండు రకాల అవసరాలకు సరఫరా చేసే నీటి పనులకు రూ.7 వేల 214 కోట్ల ఖర్చును అంచనాలో పొందుపరిచారు. ఈ ఖర్చును వేరు చేసి 2013-14 ధరల ప్రకారం సాగునీటి పనులకే కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించగా ఇటీవల జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో 2017-18 ధరల ప్రకారం చెల్లిస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుందని తీర్మానించి మినిట్స్‌ను కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు పంపింది. ఇది అక్కడి నుంచి ఆర్థికశాఖ లేదా మంత్రివర్గానికి వెళ్లాలి. ఆర్థిక మంత్రిత్వశాఖ తాగునీటి ఖర్చును మినహాయించిన నేపథ్యంలో వాస్తవాల నిర్ధరణకు మళ్లీ జలసంఘానికి పంపినట్లు తెలిసింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని 2013-14 ధరల ప్రకారం రూ. 29 వేల 27 కోట్లుగా అంచనావేశారు. ఇందులో విద్యుత్తు, తాగునీటి పనులను మినహాయించి రూ.20 వేల 398 కోట్ల 61 లక్షలకు ఖరారు చేశారు. దీనిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీలో చర్చ జరిగింది. ఈ మొత్తంతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాదని 2017-18 ధరల ప్రకారం అయితేనే పూర్తవుతుందని మినిట్స్‌లో పేర్కొన్నారు.

అన్ని జాతీయ ప్రాజెక్టుల్లో తాగునీటి ఖర్చు కూడా ప్రాజెక్టులో భాగం కాగా పోలవరంలో మాత్రమే దీన్ని మినహాయించడంపైనా పోలవరం ప్రాజెక్టు అథారిటీలో చర్చ జరిగింది. పోలవరం ద్వారా నీటి వినియోగంలో 23.44 టీఎంసీలు పరిశ్రమలకు, తాగు అవసరాలకు ఉంది. ఇందులో 79 శాతం నీరు పారిశ్రామిక అవసరాలకే ఉంది. కిలోలీటర్‌ 29తో పారిశ్రామిక అవసరాలకు నీటిని సరఫరా చేసేలా పేర్కొని.... పనుల ఖర్చుపై అంచనా రూపొందించినట్లు తెలిసింది. కర్ణాటకలో ఈ ధర 10 ఉండగా, మహారాష్ట్రలో రూ.6 ఉందని, వీటన్నింటినీ కేంద్ర జలసంఘం పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావాలంటే 2017-18 ధరల ప్రకారం ఆమోదించిన 47 వేల 725 కోట్ల 74 లక్షల రూపాయలు కావాల్సిందేనని నీటిపారుదలశాఖ వర్గాలు తెలిపాయి. తాగు, పారిశ్రామిక నీటి పనుల అంచనాను తగ్గిస్తే ఆ మేరకు సాగునీటి ఖర్చు పెరిగి కాస్ట్‌ బెనిఫిట్‌ రేషియోలో తేడా వస్తుందని వెల్లడించాయి. మొత్తం ప్రాజెక్టు అంచనాలో 10 శాతం కంటే తక్కువ తాగునీటి ఖర్చు ఉండొచ్చని అయితే పోలవరంలో ఎక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. అందువల్లే కేంద్ర జలసంఘం మళ్లీ పరిశీలనకు పంపి ఉండొచ్చని తెలిపారు.

ఇదీ చదవండి :చంద్రబాబు సహా.. తెదేపా సభ్యుల సస్పెన్షన్

ABOUT THE AUTHOR

...view details