పోలవరం ప్రాజెక్టు పూర్తికాకముందే.. లక్షల ఎకరాల కృష్ణా డెల్టాకు.. పట్టిసీమ ద్వారా వేల క్యూసెక్కుల నీటిని మోసుకొస్తున్న కుడికాలువ పరిస్థితి ప్రశ్నార్థకమవుతోంది. గోదావరి, కృష్ణా నదుల అనుసందానకర్తగా.. పశ్చిమగోదావరిజిల్లాలో ఉన్న పోలవరం కుడికాలువ గట్లు చరిత్ర పుటల్లోకెక్కాయి. పోలవరం కుడికాలువ రెండువైపులా వంద మీటర్ల మేర ఖాలీ స్థలం ఉంది. ఈ స్థలంపై కన్నేసినవారు మట్టిని తరలించి.. భూమిని ఆక్రమిస్తున్నారు. పోలవరం, కొయ్యలగూడెం, దేవరపల్లి, నల్లజర్ల, భీమడోలు, ఉంగటూరు, దెందలూరు, పెదవేగి మండలాల గుండా కుడికాలువ ప్రవహిస్తుంది. వీటిలో కొన్ని మండలాల్లో ఇప్పటికే 50శాతానికి పైగా కాలువగట్టు మట్టిని అక్రమంగా తరలించారు.
గత కొన్నేళ్లుగా మట్టి అక్రమ రవాణా కొనసాగుతున్నా.. అధికారులు పట్టించుకోలేదని.. ఇప్పుడు కాలువ గట్లు సైతం ఆక్రమణకు గురవుతున్నాయని.. స్థానికులు అంటున్నారు.
పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు అందించడంలో కుడికాలువ కీలక భూమిక పోషిస్తుంది. సుమారు 18వేల క్యూసెక్కుల నీటిని పోలవరం ప్రాజెక్టు నుంచి సరఫరా చేసే సామర్థ్యం ఈ కాలువకు ఉంది. సుమారు 178కిలోమీటర్ల మేర పొడువు ఉన్న ఈ కాలువ పనులు ఇప్పటికే పూర్తిచేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 120కిలోమీటర్ల మేర కుడికాలువ విస్తరించింది. భవిష్యత్తు అవసరాల కోసం కాలువ గట్టుకు రెండు వైపులా భూమిని అధికంగా సేకరించారు. ఆక్రమణల ఫలితంగా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే.. ఆస్కారముంది.
ప్రధానంగా కుడి కాలువ మట్టికి జిల్లాలో భారీగా గిరాకీ ఉంది. ఎర్రగరప గ్రావెల్ మట్టికావడం వల్ల.. రహదారులు, ఇంటి నిర్మాణాల కోసం ఈ మట్టిని అధికంగా వినియోగిస్తున్నారు. డెల్టా ప్రాంతంలో అధికంగా అవసరమయ్యే ఈ మట్టి.. వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. ట్రాక్టర్ మట్టి 3వేల రూపాయలు, టిప్పర్ అయితే 8వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఉంగటూరు మండలంలో అధికంగా అక్రమరవాణా సాగుతోంది. భీమడోలు, దెందలూరు, పెదవేగి మండలాల్లో ఈ మట్టి తరలించేందుకు ప్రత్యేకంగా మాఫియాలు ఏర్పడ్డాయి. రాత్రి సమయాల్లో అక్రమంగా రవాణా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి.. పోలవరం కుడికాలువగట్టు మట్టి అక్రమ రవాణా నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి:ఆరోగ్యశ్రీ వైద్య సేవల విస్తరణ ప్రారంభించిన సీఎం జగన్..